ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర శివాజీతో భేటీ అయిన మంత్రి నారా లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 06:34 AM

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సర్దార్ గౌతు లచ్చన్న తనయుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర శివాజీతో శుక్రవారం భేటీ అయ్యారు. లోకేశ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శివాజీకి, లోకేశ్ స్వయంగా ఎదురెళ్లి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్, గౌతు శివాజీతో కలిసి భోజనం చేసి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ భేటీలో వర్తమాన, నాటి రాజకీయ పరిస్థితులు, రాజకీయాల్లో నైతిక విలువల ప్రాధాన్యత గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై లోకేశ్.. శివాజీ నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న కుమారుడిగా, దాదాపు నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్న శివాజీ తన రాజకీయ అనుభవాలను లోకేశ్ తో పంచుకున్నారు. తాను గతంలో మంత్రిగా పనిచేసిన శాఖల పనితీరు, ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన విధానాలను లోకేశ్ కు వివరించారు.గౌతు శివాజీ చెబుతున్న అలనాటి రాజకీయ ముచ్చట్లను, ఆయన అనుభవాలను లోకేశ్ ఆసక్తిగా విన్నారు. సీనియర్ నేతలను గౌరవించడం, వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి మరింత మెరుగైన సేవలు అందించవచ్చని లోకేశ్ భావిస్తున్నట్లు ఈ సమావేశం తెలియజేస్తోంది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న లోకేశ్, పార్టీలోని సీనియర్ నేతల అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఆత్మీయ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa