ఏపీ రాజకీయాల్లో, జనసేన పార్టీలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ.. అరవ శ్రీధర్ నుంచి వివరాలు సేకరించింది. తన వద్ద ఉన్న ఆధారాలు కమిటీకి ఇచ్చానని.. అన్ని విషయాలు కూడా వెల్లడించానని.. కమిటీ విచారణ తర్వాత రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మీడియా సమావేశాలు నిర్వహించి అరవ శ్రీధర్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ.. సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని వీడియోలను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఒక వీడియోను రిలీజ్ చేసింది.
తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్‌ను బాధిత మహిళ ఆ వీడియోలో కోరింది. తనకు జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్‌ను కలిసి వివరించాలని భావిస్తున్నానని.. ఆయనే తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఎవరు పడితే వాళ్లతో మాటలు పడాల్సిన దౌర్భాగ్యం తనకు పట్టలేదని.. ఒక్కసారి పవన్ కళ్యాణ్‌ను కలిసే అవకాశం తనకు ఇస్తే.. అసలు మొత్తం ఏం జరిగింది అనేది పూర్తిగా వివరిస్తానని ఆ వీడియోలో తెలిపింది.
అంతేకాకుండా అరవ శ్రీధర్.. ఒక ఎమ్మెల్యే కాకున్నా.. ప్రభుత్వ విప్ పదవి లేకుండా ఒక సాధారణ వ్యక్తి అయితో తనకు అతడు చేసిన ద్రోహానికి ఇప్పటికే అరెస్ట్ అయి జైలులో ఉండేవాడని ఆ మహిళ పేర్కొంది. అరవ శ్రీధర్ ప్రస్తుతం పదవిలో ఉన్నాడు కాబట్టే ధైర్యంగా బయట తిరుగుతున్నాడని సంచలనం ఆరోపణలు గుప్పించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. ఈ వ్యవహారంపై అందరూ కలిసి రాజకీయం చేస్తున్నట్లు అర్థం అవుతోందని తెలిపింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. ఈ వ్యవహారంలో రాజకీయం చేస్తోంది అరవ శ్రీధరేనని.. తాను ఎలాంటి రాజకీయాలు చేయట్లేదని బాధిత మహిళ స్పష్టం చేసింది.
మరోవైపు.. జనసేన పార్టీ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో నిజానిజాలు తెలుసుకునేందుకు.. ఇటీవలే జనసేన పార్టీ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆ కమిటీ ముందు హాజరై పూర్తి వివరాలు వెల్లడించారు. తన వద్ద ఉన్న ఆధారాలు అన్నింటినీ కమిటీకి అప్పగించానని.. ఈ వ్యవహారంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని అరవ శ్రీధర్ తేల్చి చెప్పారు. ఈ విషయం తమ పర్సనల్ విషయమని.. దీన్ని పార్టీకి గానీ, పవన్ కళ్యాణ్‌కు గానీ ఆపాదించి మాట్లాడవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa