ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌బేస్‌లో హ్యాంగర్‌ను తొలగించిన పాకిస్తాన్,,,,ఆపరేషన్ సిందూర్‌లో ఐఏఎఫ్ దెబ్బకు పాక్ విలవిల

national |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 08:42 PM

గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడికి పాల్పడ్డ పాకిస్తాన్ .. ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో కకావికలం అయిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్).. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రసంస్థల శిబిరాలతోపాటు.. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లే లక్ష్యంగా భీకర వైమానిక దాడులు చేసి వాటిని నేలమట్టం చేసింది. ఇందులో ఉగ్రవాదులు హతం కావడమే కాకుండా ఆర్థికంగా కూడా వారికి భారీగా నష్టం తలెత్తింది. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ వాటిని తిరిగి నిర్మించే పనిలో పడింది. వీటికి సంబంధించిన వార్తలు, ఫోటోలు బయటికి వస్తున్నాయి.


ఇక ఆపరేషన్‌ సిందూర్‌‌లో తీవ్రంగా ధ్వంసమైన భొలారిలోని పాక్‌ ఎయిర్‌బేస్‌లోని హ్యాంగర్‌ను ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. మే 10న ఐఏఎఫ్ జరిపిన దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఎయిర్‌బార్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సాబ్‌-2000 విమానం పూర్తిగా ధ్వంసం అయినట్లు భారత వర్గాలు వెల్లడించాయి. ఈ భొలారి ఎయిర్‌బేస్‌పై భారత్ జరిపిన దాడిలో ఒక అధికారి సహా ఆరుగురు పాక్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది మరణించినట్లు సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా అప్పట్లో ప్రకటించారు.


తాజాగా గత నెల 28వ తేదీన వాంటోర్‌ సంస్థకు చెందిన శాటిలైట్లు ఆ భొలారి ఎయిర్‌బేస్‌కు సంబంధించిన ఫోటోలను తీసి పంపించాయి. అయితే ఎయిర్‌ బేస్‌లో ధ్వంసమైన హ్యాంగర్‌కు మరమ్మతులు చేసేందుకు పాకిస్తాన్ సైన్యం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడైంది. భారత్ చేసిన దాడిలో దెబ్బతిన్న గ్రీన్‌కలర్ రూఫ్ టాప్‌ను పాకిస్తాన్ తీసేసినట్లు ఆ ఫోటోల్లో కనిపిస్తోంది.


పాక్‌ చేసిన డ్రోన్‌ దాడులకు కౌంటర్‌గా భొలారీ ఎయిర్‌బేస్‌ను టార్గెట్‌ చేసుకున్న ఐఏఎఫ్.. మే 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దాడులు చేసి ఎయిర్‌బేస్‌లోని హ్యాంగర్‌ను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే ఆ దాడికి భారత వాయుసేన ఎలాంటి ఆయుధాలు ఉపయోగించి మాత్రం పేర్కొనలేదు. ఇప్పటికే భారత దాడుల్లో ధ్వంసం అయిన ఆర్మీ బేస్‌లకు పాకిస్తాన్ మరమ్మతులు చేస్తున్నట్లు అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.


ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాక్‌లోని సుమారు 10 స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేయగా.. ఇందుకోసం రఫేల్ ఫైటర్‌ జెట్ల నుంచి స్కాల్ప్‌ మిస్సైళ్లను ప్రయోగించింది. ఇక సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ర్యాంపేజ్, బ్రహ్మోస్ క్షిపణులను వదిలింది. మిరాజ్ 2000 ఫైటర్ జెట్ల నుంచి క్రిస్టల్ మేజ్ మిస్సైళ్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ భొలారీ ఎయిర్‌బేస్‌తోపాటు మురీద్‌లోని భవనం, సుక్కూర్‌లోని యూఏవీ హ్యాంగర్, నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లపైనా దాడులు జరిగినట్లు భారత్ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa