సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో దారుణం చోటు చేసుకుంది. భారత దేశానికి చెందిన దిగ్గజ సంస్థ 'లార్సెన్ అండ్ టూబ్రో' స్టాల్‌పై ఒక వ్యక్తి మతపరమైన విద్వేషాన్ని వెళ్లగక్కారు. ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న సిబ్బందిని హేళన చేస్తూ దూషించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మతం పేరుతో వెటకారం.. అసలేం జరిగిందంటే?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రియాద్ ఎక్స్‌పోలోని ఎల్ అండ్ టీ స్టాల్ వద్దకు వెళ్లిన ఒక సౌదీ వ్యక్తి.. ఆ కంపెనీని 'హిందూ' కంపెనీగా అభివర్ణిస్తూ ఎగతాళి చేశాడు. అంతటితో ఆగకుండా ఆ స్టాల్‌లో కనీసం ఒక్క ముస్లిం కూడా లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. అక్కడ ఉన్న భారతీయ ప్రతినిధి ఈ ఘటనను తన ఫోన్‌లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించగా.. సదరు వ్యక్తి మరింత రెచ్చిపోయి దుర్భాషలాడటం వీడియోలో కనిపిస్తోంది. ఒక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై మతం ప్రాతిపదికన వివక్ష చూపడం చూసి అక్కడి వారంతా విస్మయానికి గురయ్యారు.
ముఖ్యంగా యూఏఈకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అమ్జాద్ తాహా ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. తీవ్రంగా స్పందించారు. దీనిని నగ్నమైన జాతి వివక్షగా అభివర్ణించారు. "ఒక భారతీయుడు హిందూ అయినందున, రియాద్ ఎగ్జిబిషన్‌లో స్టాల్ ఏర్పాటు చేయడం వల్ల.. అతడిని వేధించడం అజ్ఞానానికి పరాకాష్ట. వ్యాపారం అనేది మసీదులో హాజరు తీసుకునే ప్రక్రియ కాదు. ఆధునిక సమాజంలో మతపరమైన పర్యవేక్షణకు చోటు లేదు. భారత్ ఒక గొప్ప నాగరికత గల దేశం.. ఇలాంటి మతపరమైన గూండాలకు అది తలవంచదు" అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు.
'ఎల్ అండ్ టీ స్థాయి మీకు తెలుసా?'
ఈ ఘటనపై నెటిజన్లు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. వేధింపులకు గురైన ఎల్ అండ్ టీ కంపెనీ విలువ సుమారు 60 నుంచి 70 బిలియన్ డాలర్లని.. అటువంటి సంస్థలో ఉద్యోగం సంపాదించే అర్హత కూడా ఆ వేధించిన వ్యక్తికి ఉండకపోవచ్చని ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ.. "భారత దేశానికి అణ్వాయుధ జలాంతర్గాములను తయారు చేసే సాంకేతిక సామర్థ్యం గల సంస్థ ఇది. సౌదీల వద్ద ఉన్న డబ్బుతో కూడా ఇటువంటి పరిజ్ఞానాన్ని కొనలేరు" అంటూ కంపెనీ గొప్పతనాన్ని చాటిచెప్పారు.
1938లో స్థాపించబడిన ఎల్ అండ్ టీ.. ప్రస్తుతం మైనింగ్, మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో సౌదీ అరేబియాతో కలిసి అనేక భారీ ప్రాజెక్టులను చేపడుతోంది. భారత్-సౌదీ మధ్య ఆర్థిక బంధం అత్యున్నత స్థాయిలో ఉన్న తరుణంలో ఇలాంటి వ్యక్తిగత విద్వేషపూరిత ఘటనలు రెండు దేశాల సత్సంబంధాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సౌదీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa