ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాల్లో నుంచి ఒక్కసారిగా కిందపడ్డ సునామీ రైడ్, ఇన్‌స్పెక్టర్ మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 08:03 PM

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే సూరజ్‌కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళాలో శనివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా ఎక్కిన 'సునామీ రైడ్' గాలిలో ఉండగానే అకస్మాత్తుగా విరిగి కిందపడిపోయింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ప్రజలను రక్షించే క్రమంలో విధుల్లో ఉన్న ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్ ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది.


శనివారం సాయంత్రం సుమారు 6.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సునామీ రైడ్‌లో సుమారు 15 మంది పర్యాటకులు ఉన్నారు. రైడ్ వేగంగా తిరుగుతుండగా.. కింద ఉన్న సందర్శకులు ఉత్సాహంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. ఈక్రమంలోనే ఊహించని విధంగా రైడ్ ఒక పక్కకు ఒరిగిపోయి.. వెంటనే దాని ఫ్రేమ్ విరిగి ఒక్కసారిగా నేలకూలింది. ఈ దృశ్యాన్ని చూసిన పర్యాటకులు భయాందోళనతో పరుగులు తీశారు. గాలిలో వేలాడుతున్న వ్యక్తులు హాహాకారాలు చేస్తూ కింద పడిపోవడం అక్కడున్న వారిని నివ్వెరపరిచింది.


ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా నేతృత్వంలో పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మేళా ప్రాంగణాన్ని వెంటనే ఖాళీ చేయించి.. గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఇన్స్‌పెక్టర్ జగదీష్ ప్రసాద్ మరణించడం పట్ల పోలీస్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రజలను రక్షించే ప్రయత్నంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారని హర్యానా డీజీపీ అజయ్ సింఘాల్ పేర్కొన్నారు. నేరుగా ఆయనే ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అలాగే క్షతగాత్రులు అందరికీ మెరుగైన వైద్యం సహాయం అందించాలని వైద్యులను ఆదేశించారు.


ఈ దారుణ ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సైని స్పందించారు. మరణించిన ఇన్స్‌పెక్టర్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "సూరజ్‌కుండ్ మేళాలో జరిగిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది" అని ఆయన ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఈ రైడ్‌కు సంబంధించి భద్రతా ప్రమాణాలు పాటించారా? అనుమతులు ఉన్నాయా? అనే కోణంలో ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 31వ తేదీన ప్రారంభమైన ఈ సూరజ్‌కుండ్ మేళా ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa