ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లిదండ్రులను చూసుకోవడానికి 45 రోజుల సెలవు ఇవ్వాలి: పార్లమెంట్‌లో ఎంపీ ప్రతిపాదన

national |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 08:04 PM

నేటి యాంత్రిక జీవనంలో ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతల సక్రమంగా నిర్వర్తించలేక.. నలిగిపోతున్న ఉద్యోగులకు కష్టాల గురించి పార్లమెంటులో ఓ ఎంపీ మాట్లాడారు. ముఖ్యంగా నిత్యం ఒత్తిడితో నలిగిపోతున్న 'శాండ్‌విచ్ జనరేషన్' తరపున ఉత్తర ప్రదేశ్ ఎంపీ సుమిత్రా వాల్మీకి రాజ్యసభలో గళమెత్తారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ ఏడాదిలో కనీసం 45 రోజుల పాటు తప్పనిసరి సెలవు మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన 'జీరో అవర్'లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, ఉపాధి అవకాశాల కోసం యువత తమ సొంత గ్రామాలను, తల్లిదండ్రులను వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని సుమిత్రా వాల్మీకి ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పూర్తిగా ఒంటరి వారు అవుతున్నారని ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా వారికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు.. ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి, పక్కనే ఉండి సేవ చేయడానికి కొడుకు లేదా కూతురు ఉండటం అత్యంత అవసరమని, కానీ ఆఫీసుల్లో సెలవులు దొరక్క యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆమె వివరించారు.


 2026 నాటికి భారతదేశం అత్యధిక యువశక్తి కలిగిన దేశంగా ఉన్నప్పటికీ.. వృద్ధుల సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోందని ఎంపీ గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 14.9 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉండగా.. 2036 నాటికి ఈ సంఖ్య 23 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. అంటే భవిష్యత్తులో ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు వృద్ధులే ఉంటారని.. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే 'పేరంటల్ కేర్ లీవ్' వంటి విధానాలను చట్టబద్ధం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.


చట్టబద్ధమైన సెలవులే ఏకైక మార్గం


కేవలం మహిళల అభ్యున్నతి లేదా యువత సాధికారతపైనే కాకుండా.. వృద్ధుల సంరక్షణపై కూడా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఎంపీ సుమిత్రా వాల్మీకి స్పష్టం చేశారు. 60 ఏళ్లు దాటిన తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఉద్యోగికి వారిని చూసుకోవడానికి ఆఫీసు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా 45 రోజుల సెలవు దొరికితేనే వృద్ధుల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఈ విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందని.. కొన్ని రోజులైనా పిల్లలు తల్లిదండ్రులతో కలిసి, వారి బాగోగులు చూస్కుంటూ సేవ చేసుకునే భాగ్యం దక్కుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa