సొంత చెల్లిని పెళ్లి చేసుకొని, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భానికి కారణమైన యువకుడి కేసులో విజయవాడ పోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి మరణించే వరకూ జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. ఓ కుటుంబానికి చెందిన దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు విడిగా నివసిస్తున్నారు. తల్లి ఇద్దరు కుమార్తెలతో కలిసి కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో ఉండగా, తండ్రి కుమారుడితో కలిసి ప్రకాశం జిల్లా కొండపి మండలం పెంట్లూరులో స్థిరపడ్డాడు. 2023లో 21 ఏళ్ల కుమారుడు తల్లి, చెల్లెళ్లను కలిసేందుకు వస్తున్నానని చెప్పి మంటాడకు చేరుకున్నాడు. అక్కడ పెద్ద చెల్లి (17)తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2024 క్రిస్మస్ సందర్భంగా మళ్లీ మంటాడకు వచ్చిన అతడు.. తండ్రి వద్దకు తీసుకెళ్తానని చెప్పి బాలికను విజయవాడలోని ఓ చర్చికి తీసుకెళ్లి తాళి కట్టాడు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి అక్కడ కూడా అనేకసార్లు లైంగిక దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసిన తరువాత నిందితుడు ఆమెను గత ఏడాది ఫిబ్రవరిలో ఒంగోలు బస్టాండులో వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన బాలిక కొన్ని రోజులకే జ్వరం, వాంతులతో అస్వస్థతకు గురి కావడంతో తల్లి వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భిణిగా తేలింది. ఆమెను తల్లి గట్టిగా ప్రశ్నించగా జరిగిన విషయం మొత్తం చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పమిడిముక్కల పోలీసులు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ నిందితుడిని పెంట్లూరులో అరెస్టు చేశారు. ఈ కేసును స్పీడ్ ట్రయల్‌గా విజయవాడ పోక్సో కోర్టు జడ్జి వి.భవానీ విచారణ జరిపి నిన్న తీర్పు వెల్లడించారు. నిందితుడికి మరణించే వరకు జీవితకాల కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.30 వేలు చెల్లించాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa