ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్.. ,, కిరణ్ రాయల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 06:13 PM

ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం.. గత కొన్ని నెలలుగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందంటూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై అటు వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దీనిపై ప్రత్యేకంగా సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. ఆ సిట్ నివేదిక ఇవ్వగా.. దానిపైనా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలోనే తిరుమలకు సంబంధించి తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది.


గత వైసీపీ హయాంలో తిరుమలలో భారీ అవినీతి జరిగిందంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలకు తెరతీశారు. తిరుమలలో భగవద్గీత పుస్తకాల పేరుతో ఈ అవినీతి జరిగిందని రాయల్‌ ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఈ భగవద్గీత పుస్తకాల కుంభకోణం.. అతిపెద్ద స్కామ్‌ అని ఆయన అభివర్ణించారు. తాజాగా తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కిరణ్ రాయల్.. 50 గ్రాములు కూడా లేని భగవద్గీత పుస్తకాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ముద్రించారని మండిపడ్డారు.


కేవలం 15 పేజీలతో ఉండే భగవద్గీతను ఇప్పటివరకు ఎక్కడా, ఎవరూ ముద్రించ లేదని.. కానీ అది గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిందని కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 700 శ్లోకాలతో భగవద్గీత పుస్తకం ఉంటుందని గుర్తు చేశారు. భగవద్గీత పుస్తకాన్ని ముద్రించడంలో అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేరు ఎందుకని కిరణ్ రాయల్ నిలదీశారు. టీటీడీ ముద్రించింది ఏమైనా భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు రాసిన భగవద్గీతనా అని ప్రశ్నించారు.


తిరుమలలో భగవద్గీత పుస్తకం ముద్రణ పేరుతో కోట్ల రూపాయలను దండుకున్నారని కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవుడికి అన్యాయం చేసి వారు ఎందుకు క్షమాపణలు చెప్పడం లేదని ప్రశ్నించారు. హిందూ సమాజానికి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డిలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భగవద్గీత బాగోతాన్ని బయటపెట్టినందుకే టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడును టార్గెట్‌ చేశారని ఆరోపించారు. అందుకే ఆయనపై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కిరణ్‌ రాయల్‌ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa