ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత స్థావరాల నుంచే ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తోందా

national |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 07:15 PM

పశ్చిమాసియాలో యుద్ధంలో ఇరాన్‌పై దాడులకు భారత్ నౌకదళ స్థావరాలను అమెరికా ఉపయోగించుకుంటోందని ఆరోపించిన నివేదికలను న్యూఢిల్లీ తోసిపుచ్చింది. ఇవి పూర్తిగా నిరాధారమైనవని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రేరర్ అమెరికా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇరాన్‌పై యుద్ధానికి భారత నౌకాదళ స్థావరాలను అమెరికా వినియోగించకుందని ఆరోపించారు. బుధవారం శ్రీలంకలోని గాలె వద్ద హిందూ మహా సముద్రంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరెస్ డెన్‌ను జలాంతర్గామితో అమెరికా దాడిచేసి ముంచేసింది. ఈ ఘటనలో 150 మంది గల్లంతుకాగా.. మరో 32 మంది గాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్‌ పోర్టు నుంచే దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది.


‘మా స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. మా నౌకాశ్రయ మౌలిక సౌకర్యాలు నాశమయ్యాయి. వాస్తవానికి భారత్, భారత నౌకాశ్రయాలపై మేము ఆధారపడాల్సి వస్తోంది. ఇది అంత మంచిది కాదని మా నేవీ అంటోంది’ అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ.. ‘ఇలాంటి నిరాధారమైన, కల్పిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’ అని కౌంటర్ ఇచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న భారత్.. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఇరు వర్గాలూ సంయమనం పాటించి ఉద్రిక్తతలు తగ్గించాలని కోరుతోంది.


గతవారం ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఇరాన్‌పై దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక నాయకులు, అధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే అమెరికా.. శ్రీలంక తీరం సమీపంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడిచేసి ముంచేసింది. ఇప్పటి వరకూ 87 మృతదేహాలను వెలికితీశారు. గత నెల విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 కోసం వచ్చిన ఈ నౌక.. స్వదేశానికి తిరిగి వెళ్తున్న సమయంలోనే దాడికి గురయ్యింది.


ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆరో రోజులోకి ప్రవేశించినా.. ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఇరాన్‌లో దాదాపు 1,100 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఐదు వేల మందికిపైగా గాయపడ్డారు. ఇక, ఇజ్రాయెల్‌లోనూ పలువురు చనిపోగా.. అమెరికా ఆరుగురు సైనికులను కోల్పోయింది. ఇక, ఆరు రోజుల్లోనే యుద్ధం భయంతో లక్ష మంది ఇరాన్‌ను వీడినట్టు నివేదికలు అందుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa