ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాపులేషన్ మేనేజ్‌మెంట్' జనాభా నిర్వహణ విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శాసనసభలో కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 08:07 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అత్యంత కీలకమైన 'పాపులేషన్ మేనేజ్‌మెంట్'  విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శాసనసభలో కీలక ప్రకటన చేశారు. దశాబ్దాలుగా అమలులో ఉన్న 'ఫ్యామిలీ ప్లానింగ్' విధానం నుంచి ఇకపై 'పాపులేషన్ కేర్' వైపు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సిద్ధం చేసిన ముసాయిదా పాలసీని సభలో ప్రవేశపెట్టారు.రాష్ట్రంలో జననాల రేటు  ఆందోళనకరంగా పడిపోతోందని ముఖ్యమంత్రి గణాంకాలతో సహా వివరించారు. 1993లో 3.0గా ఉన్న ఫెర్టిలిటీ రేటు ప్రస్తుతం 1.5కు పడిపోయిందని తెలిపారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులే ఇప్పుడు ఏపీలోనూ కనిపిస్తున్నాయన్నారు. జననాల రేటు ఇలాగే వేగంగా తగ్గిపోతే భవిష్యత్తులో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్నవారికి రాజకీయ ప్రాతినిధ్యం దక్కదేమో అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు జోక్యం చేసుకోకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఏటా 6.70 లక్షల జననాలు నమోదవుతున్నాయని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2047 నాటికి మన జనాభాలో 23 శాతం మంది వృద్ధులే ఉంటారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పాపులేషన్ మేనేజ్‌మెంట్ కోసం 'ఐదు అంచెల లైఫ్ సైకిల్' విధానాన్ని తెరపైకి తెచ్చినట్లు వెల్లడించారు. మాతృత్వం, శక్తి, క్షేమం, నైపుణ్యం, సంజీవని అనే ఐదు పిల్లర్ల ద్వారా మహిళ గర్భధారణ నుంచి వృద్ధాప్యం వరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ప్రస్తుతం 31 శాతంగా ఉందని, దీనిని 59 శాతానికి పెంచగలిగితే రాష్ట్ర జీఎస్‌DP 15 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. సంతానోత్పత్తి సమస్యలతో బాధపడే దంపతులను ఆదుకునేందుకు 'మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా పీపీపీ  పద్ధతిలో తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీపై ఐవీఎఫ్ సేవలు అందించే ఆలోచనలో ఉన్నామన్నారు. అలాగే అనవసర సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించడం, ప్రస్తుతం 8.8 శాతంగా ఉన్న టీనేజ్ గర్భధారణలను 3 శాతం కంటే తక్కువకు తీసుకురావడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ ముసాయిదా పాలసీని ప్రజల ముందు ఉంచుతున్నామని, దీనిపై రాబోయే నెల రోజుల పాటు విస్తృత చర్చ జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే దీనికి తుది రూపం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa