తిరుమలలో దివ్వెల మాధురి మరోసారి అత్యుత్సాహాం ప్రదర్శించారు. శ్రీవారి సన్నిధిలో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన ఆమె.. కేక్ కట్ చేయించారు. తిరుమలలో కేక్‌లపై నిషేధం ఉన్నా.. ఆమె కొండపైకి తీసుకొచ్చి తనూజతో కట్ చేయించారు. తాము బసచేసిన గెస్ట్‌హౌస్‌లో ఈ వేడుకలను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను మాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని కొండపై వ్యక్తిగత వేడుకలు నిర్వహించే విషయంలో పలు నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ వేడుకలు నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ విభాగం కేక్ ఎలా వచ్చిందని ఆరా తీస్తోంది.
గతంలోనూ ఒకసారి దివ్వెల మాధురి తిరుమలలో రీల్స్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి సన్నిధిలో దువ్వాడ శ్రీనివాస్‌తో కలసి రీల్స్ చేసి విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ విషయంలో ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆలయ సంస్కృతిని, సంప్రదాయాలను ఉల్లంఘించారని భక్తులు, టీటీడీ అధికారులు పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం వద్ద ఫొటో షూట్ చేసి, వాటిని మీడియాతో పంచుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. అయినాసరే మళ్లీ అలాంటి చర్యకే పాల్పడటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కాగా, దివ్వెల మాధురి బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ తనూజతో ఆమెకు ఏర్పడిన స్నేహం బయటకొచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమెతో కలిసి తిరుమలకు వెళ్లి.. పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్‌చేయించి.. చీర, గాజులు, బంగారు చెవి దిద్దులను తనూజకు మాధురి కానుకగా ఇచ్చారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘హ్యాపీ బర్త్ డే బంగారం.. స్వర్గం నుంచి దిగివచ్చిన మై స్వీట్ హార్ట్.. తనూజతో జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు’’ అంటూ సోషల్ మీడియాలో పెట్టారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, తనూజలు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa