ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్.. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. మార్చి మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలులో గరిష్ఠ ఉష్ణోగ్రత ఏకంగా 38.5 డిగ్రీలు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా, అమరావతి, పల్నాడు జిల్లా, కడప, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.8 నుంచి 2.4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని.. 2 నుంచి 3 డిగ్రీలు పెరగొచ్చని చెబుతున్నారు. ఇక కోస్తా జిల్లాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఈసారి మార్చి నుంచి భానుడి భగభగలు తప్పవని.. వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.
మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఇటీవల తెలిపారు. ఈసారి వడగాలుల తీవ్రత కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండలకు సంబంధించిన సమాచారం అందించేందుకు రాష్ట్ర కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 18004250101 ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ నంబర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.
అంతేకాదు ప్రజలకు వడగాలుల తీవత్రపై ఎప్పటికప్పుడు మెసేజ్లు కూడా పంపించనున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదని.. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది ఎండలు, వేడిగాలులు తీవ్రత గట్టిగానే ఉండబోతోంది. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని జనాలు భయపడిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa