ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడంపై అయ్యన్నపాత్రుడు అసహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 07:51 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతుండటంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల గురించి గళం విప్పుతారని ఓట్లు వేసి గెలిపిస్తే, సభకు రాకుండా పారిపోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని మండిపడ్డారు. సభకు హాజరుకాకుండా కేవలం బయట ఉంటూ జీతభత్యాలు తీసుకోవడం నైతికంగా సరికాదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని చెప్పారు.కేవలం గవర్నర్ ప్రసంగం రోజున వచ్చి కాసేపు నిరసన తెలిపి వెళ్లినంత మాత్రాన అది పూర్తిస్థాయి హాజరు అనిపించుకోదని స్పీకర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వరుసగా 65 రోజుల పాటు సభకు అనుమతి లేకుండా గైర్హాజరైతే ఆ సభ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రజా ప్రతినిధులను 'రీకాల్' చేసే హక్కు ప్రజలకు ఉండాలని, దీనిపై చట్ట సవరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్య కేవలం ఏపీకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా చట్టసభల గౌరవాన్ని కాపాడటానికి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి చర్చిస్తానని తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే సీటు వద్ద ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా సభ్యుల హాజరును కచ్చితంగా నమోదు చేస్తున్నామని, దీని ద్వారా ఎవరు ఎంతసేపు సభలో ఉన్నారో రికార్డు అవుతుందని స్పీకర్ వివరించారు. నిబంధనల ప్రకారం కనీసం 10 శాతం సీట్లు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా లభిస్తుందని, కేవలం 11 సీట్లు ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడం సాధ్యం కాదని అయ్యన్న పాత్రుడు మరోసారి తేల్చిచెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa