ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IND vs ENG: సంజూ–దూబే సునామీ.. బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన భారీ హిట్టింగ్!

sports |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 09:14 PM

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 253 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89) మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, శివమ్ దూబే (25 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 43), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) మెరుపు బ్యాటింగ్‌తో జట్టు స్కోరును వేగంగా పెంచారు.చివర్లో తిలక్ వర్మ (7 బంతుల్లో 3 సిక్సర్లతో 21), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27) దూకుడుగా ఆడి స్కోర్‌ను మరింత పెంచారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ (2/40), ఆదిల్ రషీద్ (2/41) రెండేసి వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మొత్తం 19 సిక్సర్లు, 20 ఫోర్లు బాదారు.
*కొంపముంచిన హ్యారీ బ్రూక్ డ్రాప్ క్యాచ్ : టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌లోనే సంజూ శాంసన్ ఒక ఫోర్, ఒక సిక్స్ బాది జట్టు ఖాతా వేగంగా తెరిచాడు. అయితే విల్ జాక్స్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ (8) భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ కావడంతో భారత్ 20 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వదిలేయడం మ్యాచ్‌కు కీలక మలుపుగా మారింది. ఆ సమయంలో సంజూ కేవలం 15 పరుగులకే ఉన్నాడు. ఆ అవకాశం దక్కిన తర్వాత సంజూ మరింత దూకుడుగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
*సిక్సర్‌తో సంజూ హాఫ్ సెంచరీ : క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా వేగంగా పరుగులు చేయడంతో పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. లియామ్ డాసన్ వేసిన 8వ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో సంజూ శాంసన్ కేవలం 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.తర్వాత సంజూ, ఇషాన్ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో భారత్ స్కోరు వేగంగా పెరిగింది. 8.3 ఓవర్లకే టీమిండియా 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆదిల్ రషీద్ విడదీశాడు. అతని బంతికి ఇషాన్ కిషన్ క్యాచ్ ఔట్ కావడంతో రెండో వికెట్‌కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
*ఫలించిన టీమిండియా వ్యూహం : టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా శివమ్ దూబేను అప్ ది ఆర్డర్‌లో పంపించగా, అతను స్పిన్నర్లపై భారీ సిక్సర్లు బాదుతూ స్కోరు వేగం తగ్గకుండా చూసుకున్నాడు. సంజూ కూడా దూకుడుగా ఆడడంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగింది.సెంచరీకి దగ్గరగా వచ్చిన సంజూ శాంసన్‌ను విల్ జాక్స్ క్యాచ్ ఔట్‌గా పంపించడంతో మూడో వికెట్‌కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే సిక్సర్ బాది జోరు కనబర్చిన సూర్యకుమార్ యాదవ్ (11) మరుసటి బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు.దూకుడుగా ఆడుతున్న శివమ్ దూబే హార్దిక్ పాండ్యాతో జరిగిన అపార్థం కారణంగా రనౌట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా రెండు సిక్సర్లు బాదినా రనౌట్ అయ్యాడు. ఆఖరి బంతికి వరుణ్ చక్రవర్తీ క్విక్ డబుల్ తీసి జట్టు స్కోరును 253 పరుగులకు చేర్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa