ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్ ఉంచుకుంటే సరిపోతుంది. దానిని కండక్టర్‌కు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు తమ ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి, పరీక్ష పూర్తయ్యాక తిరిగి ఇంటికి రావడానికి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది సుమారు 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బస్సుల్లో విద్యార్థులను అనుమతించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, వారికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. రవాణా ఖర్చుల భారం లేకుండా, సురక్షితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఇది దోహదపడుతుంది. విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్లను తమ వెంట తీసుకువెళ్లాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa