ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా- ఇరాన్ యుద్ధం తీవ్రతరం.. చైనా మధ్యవర్తిత్వం ఆఫర్

international |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 07:19 PM

గతవారం నుంచి అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలకు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. యుద్ధంపై ఇప్పటికే భారత్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పోరాటాన్ని ముగించడానికి తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.


యూఏఈ ఉప-ప్రధాని అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సహా గల్ఫ్‌లోని ఉన్న రాజకీయ నాయకులతో ఫోన్‌లో తమ విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంభాషణలు జరిపారని లిన్ చెప్పారు. జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఇస్తుందని, దౌత్యం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేలా ఇతర గల్ఫ్ దేశాలకు కూడా మద్దతు ఇస్తుందని వాంగ్ యీ అన్నారు. ‘‘యుద్ధం వల్ల ప్రజలు మాత్రమే నష్టపోతారు.. శాంతి కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూనే ఉంటుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శాంతి ప్రక్రియ కోసం ప్రత్యేక రాయబారిని పంపే ప్రణాళికలను ధ్రువీకరించింది.


సౌదీ అరేబియా దౌత్యవేత్త ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌తో కూడా తమ ప్రతినిది మాట్లాడారని పేర్కొంది. ఈ సందర్భంగా కీలకమైన రాస్ తనూరా రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడుల తర్వాత సౌదీ సంయమనాన్ని, ఈ వివాదం శాంతియుత పరిష్కారానికి దాని నిబద్ధతను ఆయన ప్రశంసించారని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం వల్ల సౌదీ సహా ఇతర గల్ఫ్ దేశాలు ప్రభావితం అవుతున్నాయని పేర్కొంది. రష్యా, ఒమన్, ఫ్రాన్స్‌లతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్ ప్రతినిధులతోనూ చైనా విదేశాంగ మంత్రి మాట్లాడారు.


మరోవైపు, ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించాలని ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్‌‌లకు భారత్ పిలుపునిచ్చింది. ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్ చట్టాలను గౌరవిస్తుంది.. సైనిక ఘర్షణలతోనే ఏ సమస్య పరిష్కారం కాదు.. అది ఉక్రెయిన్ అయినా.. పశ్చిమాసియా అయినా’’ అని అన్నారు.


ఫిబ్రవరి 28న ఇరాన్ నగరాలపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడంతో యుద్ధం మొదలైంది. ఈ దాడుల్లో తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోయి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఆయిల్ రిఫైనరీలు, అమెజాన్ క్లౌడ్ డేటా సెంటర్లను టార్గెట్ చేసుకుంది. సైప్రస్‌‌లోని బ్రిటిష్ వైమానిక స్థావరంపై కూడా ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా డ్రోన్ దాడులు చేపట్టడంతో నాటో బలగాలు అప్రమత్తమయ్యాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa