బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్ తమ గొంతుకను నొక్కేస్తున్నారని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుపై 118 మందికిపైగా ప్రతిపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సీ ప్రకారం నోటీసు ఇచ్చినట్టు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ తెలిపారు.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), డీఎంకేతో సహా పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు నోటీసుపై సంతకాలు చేశారని పేర్కొన్నారు. ప్రజాప్రయోజన అంశాలను విపక్షం లేవనెత్తకుండా స్పీకర్ పదేపదే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. విపక్ష సభ్యులు మాట్లాడటానికి అనుమతించడం లేదని, అది వారి ప్రాథమిక హక్కని అన్నారు.. అలాగే, రాజ్యాంగ హక్కులను వినియోగించుకున్నందుకు 8 మంది విపక్ష సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని గొగొయ్ ఆరోపించారు.
అయితే, స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతకం చేయలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ తొలగింపు పిటిషన్‌పై ప్రతిపక్ష నేత సంతకం చేయడం సరైంది కాదని తెలిపాయి. రాహుల్ గాంధీ సంతకం చేయకపోవడానికి అదే కారణమని వివరించాయి.
కాగా, బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులను సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేయడం, ప్రధానిపై దాడికి కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రయత్నించారని నిరాధార ఆరోపణలు చేసి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలతో అవిశ్వాస తీర్మానం అంశాన్ని విపక్షాలు తెర పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఆర్టికల్ 94(c) ప్రకారం స్పీకర్‌ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టొచ్చు. అయితే, ఇందుకు కనీసం 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, నోటీసుపై కనీసం 50 నుంచి 100 మంది ఎంపీల సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విపక్షం తమ నోటీసుపై 118 మంది ఎంపీలు సంతకం చేసినట్టు పేర్కొంది. దీంతో తీర్మానం తప్పకుండా ఆమోదించాల్సిన పరిస్థితి నెలకుంది. అదే జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. కానీ, ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్నందున ఈ తీర్మానం వీగిపోయినప్పటికీ స్పీకర్ స్థానాన్ని వివాదాల్లోకి లాగడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa