ఈ రోజుల్లో జంక్ ఫుడ్ కేవలం ఆహార పదార్థం కాదు ఒక ఫ్యాషన్‌గా మారింది. బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాకేజ్డ్ స్నాక్స్, షుగరీ డ్రింక్స్ అన్ని వయసుల వారికి ఇష్టమైనవి మారిపోయాయి. ఇక గత రెండు దశాబ్ధాలుగా పిల్లల ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఒకప్పుడు అప్పుడప్పుడు తినే ఆహారం ఇప్పుడు రోజూ తినే అలవాటుగా మారిపోయింది. పిల్లల్లో జంక్ ఫుడ్ తినడం అనేది కేవలం లైఫ్‌స్టైల్‌కి సంబంధించింది కాదు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్య కూడా.
జంక్ ఫుడ్ అంటేనే ఎక్కువ కేలరీలు, చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలు. ఇందులో అవసరమైన పోషకాలేమీ ఉండవు. ఈ ఆహారాలు శరీరానికి కావాల్సిన పోషకాలు అందించవు. కానీ నోటికి మాత్రం రుచిగా ఉంటాయి. పిల్లల్లో జంక్ ఫుడ్ ప్రభావం, అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డాక్టర్ శ్రీనిధి టి (కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అంకుర హాస్పిటల్, హైదరాబాద్) వివరించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల ఆరోగ్యంలో జంక్ ఫుడ్ ప్రభావం
బాల్యం అనేది శారీరక, మానసిక అభివృద్ధి కీలకమైన కాలం అని డాక్టర్ శ్రీనిధి చెబుతున్నారు. పిల్లల పెరుగుదల, రోగనిరోధక శక్తి, హార్మోన్ల సమతుల్యత అనేవి చాలా ముఖ్యం. వీటికి మద్ధతు ఇవ్వడానికి శరీరానికి తగినంత ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అదే జంక్ ఫుడ్ ఈ సమతుల్య ఆహారంతో భర్తీ చేసినప్పుడు పిల్లలు బాగా తిన్నట్టు అనిపించవచ్చు.
కానీ నిజం ఏంటంటే ఇది వారి నోటికి తృప్తినిస్తుంది. కానీ, శరీరానికి కావాల్సిన పోషకాల్ని మాత్రం అందించదు. జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లలు సెల్యులార్ స్థాయిలో పోషకాహార లోపంతో బాధపడతారు. కాలక్రమేణా ఈ పోషక అసమతుల్యత శక్తి స్థాయిలు, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా మొత్తం శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేస్తుంది.
పిల్లల ప్రవర్తనపై కూడా తీవ్ర ప్రభావం
జంక్ ఫుడ్ శారీరక ఆరోగ్యానికి మించి.. పిల్లల ప్రవర్తన, వారి అభ్యాస సామర్థ్యంలో కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు డాక్టర్ శ్రీనిధి వెల్లడించారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏకాగ్రత లేకపోవడం, చిరాకు, తరచుగా అలసట, క్రమరహిత నిద్ర సమస్యలతో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. ఈ ఆందోళనకు అనేక కారణాలు ఉన్నప్పటికీ.. పేలవమైన ఆహారపు అలవాట్లను చాలా మంది పట్టించుకోవడం లేదు. పిల్లల ఆహారం వారి శారీరక, మానసిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది.
జంక్ ఫుడ్స్ పిల్లలకు ఎలా హాని చేస్తాయి?
శుద్ధి చేసిన చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల శక్తిలో వేగంగా హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. దీంతో పిల్లల్లో అలసటకు దారితీస్తుంది. ఇది పాఠశాల పనితీరు, భావోద్వేగ నియంత్రణకు ఆటంకం కలిగిస్తుంది. పిల్లలు చిన్నప్పుడు నుంచే జంక్ ఫుడ్ తినడం వల్ల వారి అలవాట్లు క్రమంగా మారుతుంటాయి. రుచి ప్రాధాన్యత వారి ప్రయార్టీ అవుతుంది.
దీంతో, సమతుల్య ఆహారం తీసుకోవడానికి వెనుకాడతారు. పిల్లలు పదే పదే ఎక్కువ ఉప్పు, తీపి లేదా కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పుడు.. పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన భోజనం చాలా తక్కువ ఆకర్షణీయంగా అనిపించవచ్చు. అనారోగ్యకరమైన తినే విధానాలు యుక్త వయసు వరకు కొనసాగే అవకాశాన్ని పెంచుతుంది. ఇది దీర్ఘకాలిక జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
జంక్ ఫుడ్‌ని ఎలా దూరం చేయాలి?
జంక్ ఫుడ్‌ని పూర్తిగా దూరం చేయడం కష్టమే. కానీ, కొన్ని పద్ధతుల ద్వారా పిల్లల్ని క్రమక్రమంగా జంక్ ఫుడ్ నుంచి దూరం చేయవచ్చు.
ఆహారం అనేది కుటుంబం, భావోద్వేగాలు, సంస్కృతితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.
మీరు జంక్ ఫుడ్స్ నిషేధించడం వల్ల వాటిని మరింత తినాలని పిల్లలకు అనిపిస్తుంది. అందుకే నియంత్రణ, దినచర్య , అవగాహన చాలా కీలకం.
ఇంట్లో వండిన భోజనం ఎక్కువగా తినేలా ప్రోత్సహించండి. మీరు తినేటప్పుడు పిల్లలకు తినిపించండి.
మీరు జంక్ ఫుడ్ తింటే పిల్లలు కూడా దానికి అలవాటు పడతారు. మీరే రోల్‌మోడల్‌గా నిలిచి జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటే పిల్లలు అదే ఫాలో అవుతారు.
కుటుంబ సభ్యులతో కలిసి తినే సమయం, రోజూ ఒకే టైమ్‌లో తినడం వంటి చిన్న చిన్న అలవాట్లు పిల్లల్ని ఆహారంతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి సాయపడతాయి.
పిల్లలకు పండ్లు, కూరగాయల్ని ఇంట్లోనే రకరకాలుగా వండి పెట్టండి. గింజలు, నట్స్, డ్రై ఫ్రూట్స్‌ని వారికి స్నాక్స్ ఐటమ్స్‌లా అలవాటు చేయండి.
చివరగా ఏం తెలుసుకోవాలి?
జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించుకోవడానికి బహుళ స్థాయిల్లో సహకారం అవసరం. కేవలం కుటుంబం, తల్లిదండ్రులు మాత్రమే కాకుండా స్కూళ్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, మీడియా తమ వంతు సహకారం అందించాలి. బాధ్యతాయుతమైన ప్రకటనలు ఉండేలా చూసుకోవాలి. బాల్యంలో పిల్లలకు సమతుల్య ఆహారపు అలవాట్లు రాబోయే కాలంలో వారికి మానసిక, శారీరక ఎదుగుదలకు సాయపడతాయి. అంతేకాకుండా మెరుగైన జీవన నాణ్యతకు మద్దతు ఇస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa