ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 05:26 PM

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందం దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని, దీని ద్వారా దేశాన్ని భారత మాత'ను అమెరికాకు అమ్మేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.విదేశీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు పన్ను రాయితీలు ఇవ్వడంపై రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నవ్వుతున్నారు, ఆమెకు నవ్వడం అంటే చాలా ఇష్టం. పెద్ద టెక్ కంపెనీలకు 20 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు ఇచ్చారు. మన డేటాతో మీరు చేసిందేమిటి అని ప్రభుత్వాన్ని నిలదీశారు.ఈ వాణిజ్య ఒప్పందం కింద టారిఫ్‌లలో చేసిన మార్పులు ఏకపక్షంగా అమెరికాకు మేలు చేసేలా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు.మొదట్లో మనపై సగటు టారిఫ్ 3 శాతం ఉండేది, ఇప్పుడు అది 18 శాతానికి పెరిగింది. అంటే ఆరు రెట్లు ఎక్కువ. అమెరికా నుంచి దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్లకు పెరుగుతాయి. కానీ మనకు వాళ్లు ఎలాంటి హామీ ఇవ్వలేదు. మనం మాత్రం వారికి కట్టుబడి ఉండాలి. వాళ్లపై మన టారిఫ్ 16 శాతం నుంచి సున్నాకి తగ్గింది, మనపై మాత్రం వాళ్ల టారిఫ్ 3 నుంచి 18 శాతానికి పెరిగింది అని ఆయన గణాంకాలతో వివరించారు.ఈ ఒప్పందం వల్ల దేశంలోని టెక్స్‌టైల్ పరిశ్రమ పూర్తిగా నాశనమవుతుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా బంగ్లాదేశ్‌పై సుంకాన్ని సున్నా శాతానికి తగ్గించింది, కానీ భారత్‌పై 18 శాతం విధిస్తోంది. మన టెక్స్‌టైల్ పరిశ్రమదారులు ఏం చేయాలి వాళ్ల పోటీదారు బంగ్లాదేశ్. వాళ్లు అమెరికా కాటన్‌ను దిగుమతి చేసుకుంటే సున్నా డ్యూటీ. దీంతో మన టెక్స్‌టైల్ పరిశ్రమ పూర్తిగా నాశనమైపోతుంది అని అన్నారు.అంతేకాకుండా, ఈ ఒప్పందం దేశ ఇంధన స్వాతంత్య్రాన్ని దెబ్బతీస్తుందని రాహుల్ ఆరోపించారు.ఇకపై మనం ఏ దేశం నుంచి చమురు కొనాలో అమెరికా నిర్ణయిస్తుంది, మన ప్రధానమంత్రి కాదు. వాళ్లు మనల్ని పర్యవేక్షిస్తారు. అమెరికాకు నచ్చని దేశం నుంచి భారత్ చమురు కొంటే, మనపై టారిఫ్‌లతో శిక్ష విధిస్తారు అని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాలరాస్తోందని పేద రైతులను అణచివేయడానికి తలుపులు తెరిచారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విమర్శల తీవ్రతను పెంచుతూ మీరు భారతదేశాన్ని అమ్మేశారని నేను చెబుతున్నాను. దేశాన్ని అమ్మడానికి మీకు సిగ్గుగా లేదా మన తల్లి భారత్ మాతను అమ్మేశారు అని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి ఒత్తిడితోనే ఈ ఒప్పందానికి అంగీకరించారని ఆయన ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలు లోక్‌సభలో తీవ్ర దుమారం రేపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa