ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెనడా స్కూళ్లో కాల్పుల కలకలం.. నిందితురాలు సహా 10 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 09:57 PM

శాంతికి నిలయమైన కెనడాలో బుధవారం మధ్యాహ్నం రక్తపాతం చోటుచేసుకుంది. బ్రిటీష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ పట్టణంలో గల ఒక సెకండరీ పాఠశాలలో ఓ మహిళా షూటర్ కాల్పులకు పాల్పడింది. కంటికి కనిపించిన వారందరిపై విచక్షణా రహితంగా కాల్పులు జరపగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ మృతుల్లోనే నిందితురాలు కూడా ఉందని.. కాల్పుల జరిపిన అనంతరం ఆమె తనను తానే కాల్చుకుని ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెబుతున్నారు.


అసలేం జరిగిందంటే..?


స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లోకి తుపాకీతో ప్రవేశించిన ఓ మహిళ.. ఒక్కసారిగా కాల్పులు మొదలు పెట్టింది. కంటికి కనిపించిన వారందరిపై కాల్పులు జరపగా.. నిమిషాల వ్యవధిలోనే పాఠశాల ప్రాంగణం మొత్తం ఆర్తనాదాలతో నిండిపోయింది. ఆ సమయంలో స్కూల్లో సుమారు 175 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే కాల్పుల శబ్దం వినగానే విద్యార్థులు ప్రాణభయంతో తరగతి గదుల్లోని అల్మారాల్లో, బల్లలు, బెంచీల కింద దాక్కున్నారు. కానీ బయటే ఉన్న వారు మాత్రం ఆమె నుంచి తప్పించుకోలేకపోయారు.


మరోవైపు పాఠశాల సిబ్బంది అప్పటికే పోలీసులకు సమాచారం అందించగా.. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) బలగాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులు అందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించాయి. మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించాయి. అలాగే ఘటన జరిగిన విధానం గురించి కూడా పోలీసులు వివరించారు. ఈ కాల్పుల ఘటనలో పాఠశాలలోనే ఆరుగురు మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు విడిచారని పోలీసులు చెప్పారు. విచారణలో భాగంగా పట్టణంలోని ఓ నివాసంలో మరో ఇద్దరు మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. నిందితురాలిని బ్రౌన్ కలర్ జుట్టు ఉన్న మహిళగా గుర్తించిన పోలీసులు.. కాల్పులు జరిపిన అనంతరం తనను తాను కాల్చుకుని పాఠశాల ప్రాంగణంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. గాయపడిన 25 మందిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారిని హెలికాప్టర్ ద్వారా ఇతర ఆసుపత్రులకు తరలించారు.


ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి..


ఈ ఘటనపై కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి విద్యార్థులను రక్షించిన పోలీసులకు, సహాయక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటీష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఏబీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2020లో నోవా స్కోటియాలో జరిగిన కాల్పుల తర్వాత కెనడాలో జరిగిన అత్యంత భీకరమైన దాడి ఇదే కావడం గమనార్హం.


కాల్పులకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని నార్త్ డిస్ట్రిక్ట్ చీఫ్ సూపర్ వైజర్ కెన్ ఫ్లాయిడ్ పేర్కొన్నారు. ఈ వారం మొత్తం పాఠశాలకు సెలవు ప్రకటించారు. దాదాపు 2,400 మంది జనాభా ఉన్న ఈ చిన్న పట్టణంలో ఇలాంటి ఘోరం జరగడంతో ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa