ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్ ఛార్జీల్లో భారీ ఉపశమనం.. కిలోమీటర్‌కు కేవలం రూ.2!

national |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 10:10 PM

దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న వందే భారత్ రైళ్లపై ప్రయాణికుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా అందుబాటులోకి రావడంతో ఈ సేవలపై చర్చ మరింత వేగం అందుకుంది.అయితే ఈ రైళ్ల టికెట్ ధరలపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. బుధవారం లోక్‌సభలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ ఛార్జీలపై కీలక ప్రకటన చేశారు.
*కిలోమీటర్‌కు రూ.2.19 మాత్రమే : వందే భారత్ ఏసీ చైర్ కార్ కోచ్‌లలో 300 నుంచి 400 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు కిలోమీటర్‌కు కేవలం రూ.2.19 మాత్రమే వసూలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి హైస్పీడ్ సేవలతో పోలిస్తే భారతదేశంలో ధరలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని చెప్పారు. చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కిలోమీటర్‌కు రూ.7 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారని ఆయన లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వందే భారత్ సేవలను నిర్వహిస్తున్నామని, ఛార్జీలు నిర్ణయించే సమయంలో సేవా వ్యయం, అందించే సౌకర్యాలు, ప్రయాణికుల భరించే సామర్థ్యం, సామాజిక-ఆర్థిక అంశాలు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
*ప్రస్తుతం 164 వందే భారత్ సర్వీసులు : 2019లో ప్రారంభమైన వందే భారత్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 82 మార్గాల్లో 164 సర్వీసులతో నడుస్తున్నాయి. వేగవంతమైన ప్రయాణంతో పాటు ఆధునిక సౌకర్యాలు ఈ రైళ్ల ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థ, ఆటోమేటెడ్ ప్లగ్ డోర్లు, సౌకర్యవంతమైన సీట్లు, మినీ ప్యాంట్రీ, సీసీటీవీ కెమెరాలు, ‘కవచ్’ భద్రతా వ్యవస్థ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి.వందే భారత్ రైళ్ల నిర్వహణ వ్యయం కంటే ప్రయాణికుల నుంచి తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నామని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ రైళ్లు దాదాపు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని, అనేక మార్గాల్లో అధిక రద్దీ ఉంటోందని మంత్రి తెలిపారు.ఇక సాధారణ తరగతి ఛార్జీల విషయానికొస్తే, భారత రైల్వేలు ప్రపంచంలోనే అత్యల్ప ధరలకు సేవలు అందిస్తున్నాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత్‌లో సాధారణ క్లాస్‌లో కిలోమీటర్‌కు సుమారు 20 పైసలే వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలిస్తే పాకిస్తాన్‌లో 54 పైసలు, బంగ్లాదేశ్‌లో 37 పైసలు, శ్రీలంకలో 51 పైసలు వసూలు చేస్తున్నట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa