బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లోతారిక్ రెహమాన్ నాయకత్వంలోని బీఎన్పీ భారీ విజయాన్ని సాధించి, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అధికారం చేపట్టబోతుంది. చివరిసారిగా ఆ పార్టీ 2001 పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందింది. అలాగే, 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు ఓ పురుషుడు ప్రధాని కాబోతున్నారు. ఇక, ఎన్నికలతో పాటు జులై నేషనల్ ఛార్టర్‌పై కూడా ఆ దేశ ఎన్నికల కమిషన్ రెఫరెండం నిర్వహించింది. ఈ రెఫరెండానికి అనుకూలంగా దాదాపు 70 శాతం మంది ఓటేసినట్టు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ సీనియర్ కార్యదర్శి అహ్మద్ అక్తర్ వెల్లడించారు. మొత్తం 4,80,74,429 మంది అనుకూలంగా.. 2,25,65,627 మంది వ్యతిరేకంగా ఓటు వేసినట్టు తెలిపారు. అయితే, బంగ్లాదేశ్‌లో సంస్కరణల ఛార్టర్ రూపొందించడం ఇది మూడోసారి కావడం గమనార్హం..
ఏంటీ జులై ఛార్టర్ ?
దేశ పాలనను సమూలంగా మార్చే లక్ష్యంతోజులై నేషనల్ చార్టర్ 2025 ఆమోదం కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జులై చార్టర్ ప్రభుత్వ పునర్నిర్మాణానికి సంబంధించిన మొత్తం 84 సంస్కరణ అంశాలను వివరిస్తుంది. జులై 2024లో విద్యార్థుల తిరుగుబాటుతో అప్పటి ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత ఈ ఛార్టర్‌ను రూపొందించారు. 270 పని దినాలలోపు ఈ సంస్కరణలను అమలు చేయాలని రాజ్యాంగ సంస్కరణల మండలి భావిస్తుంది.
చార్టర్ ప్రతిపాదనలు ఏంటి?
కీలక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రాథమికంగా పునర్నిర్మించి, నియంతృత్వ పాలన పునరావృతం కాకుండా, అధికారం కేంద్రీకృతం కాకుండా నిరోధించడమే చార్టర్ ప్రధాన లక్ష్యం. ఇందులోని 84 సంస్కరణల్లో 47కి రాజ్యాంగ సవరణలు అవసరం, మిగతా 37 చట్టాలు లేదా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తారు.
కాలపరిమితి పరిమితులు: దీర్ఘకాలం కొనసాగే నిరంకుశ పాలనను నిరోధించడానికి ప్రధాన మంత్రులకు నిర్ణీత కాలపరిమితి అమలుచేయడం.
ద్విసభ్య పార్లమెంట్: శాసనసభ అధికారాన్ని సమతుల్యం చేసే లక్ష్యంతో పార్టీల జాతీయ ఓటు షేరింగ్ ఆధారంగా సీట్లను కేటాయించి కొత్తగా 100 సీట్లతో ఎగువ సభను ఏర్పాటుచేయడం.
కార్యనిర్వాహక అధికారాల్లో కోత: ప్రధాని కార్యాలయంలో అధికార కేంద్రీకరణను తగ్గించడానికి అధ్యక్షుడి పాత్రను బలోపేతం చేయడం.
న్యాయ, సంస్థాగత స్వాతంత్య్రం: న్యాయవ్యవస్థ, ఇతర కీలక ప్రభుత్వ సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించడం.
ప్రతిపక్షాల పాత్ర: ప్రతిపక్ష నాయకులను కీలక పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు అధ్యక్షులుగా నియమించడం, డిప్యూటీ స్పీకర్‌గా నియమాకం.
‘జులై ఫైటర్స్‌కు’ రక్షణ: ‘జూలై ఫైటర్స్’ అంటే హసీనా పాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో పాల్గొన్న యువతకు రక్షణ కల్పించాలని ప్రతిపాదించారు.
మహిళల ప్రాతినిధ్యం: పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు కృషిచేయడం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa