గాల్లో ఉండగానే ఓ విమానం ఇంజిన్ పేలింది. ఆకస్మాత్తుగా బ్లాస్టింగ్ జరిగ్గా.. అందులోని ప్రయాణికులు గజగజా వణికిపోయారు. ఈ ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అరిక్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎడమవైపు ఇంజిన్ పేలింది. 27 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ప్రయాణికులు, సిబ్బంది కలిసి మెుత్తం 80 మంది అందులో ప్రయాణిస్తున్నారు. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించటంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.
లాగోస్ నుంచి పోర్ట్ హార్కోర్ట్‌కు బయల్దేరిన ఫ్లైట్ W3 740.. ముర్తలా ముహమ్మద్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు నుంచి నిన్న (ఫిబ్రవరి 13) ఉదయం 7:24 గంటలకు టేకాఫ్ అయింది. ప్రయాణం మధ్యలో విమానం ఎడమ వైపు ఇంజిన్ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎడమవైపు ఇంజిన్ పైభాగం పూర్తిగా ధ్వంసమై.. లోపలి యంత్ర భాగాలు బయటకు కనిపించే స్పష్టంగా కనిపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పైలట్లు అలర్ట్ అయ్యారు. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. విమానాన్ని సమీపంలోని బెనిన్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి ఉదయం 8:05 గంటలకు సేఫ్‌గా ల్యాండ్ చేశారు.
రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో ఎమర్జెన్సీ టీంలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా విమానం ల్యాండ్ కావటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇంజిన్ నుంచి విడిపోయిన కొన్ని భాగాలు విమానం వెనుక భాగానికి స్వల్ప నష్టం కలిగించాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై నైజీరియన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ విచారణ చేపట్టింది. ఇంజిన్‌లోని ఫ్యాన్ బ్లేడ్ విరగడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చునని ప్రాథమికంగా నిర్ధారించారు. అరిక్ ఎయిర్ సంస్థ ప్రతినిధులు జరిగిన ఘటనపై స్పందించి ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. వారు గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కాగా, ఇంజిన్ పేలిపోయి.. రన్‌వేపై ల్యాండ్ అవుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa