తమ రాష్ట్రంలో కొనసాగుతోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను అడ్డుపెట్టుకుని తన ప్రియురాలి భర్తను బూత్ లెవెల్ అధికారి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఎస్ఐఆర్‌లో అంశాల గురించి చర్చించాలని ఓ నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి, ముక్కలుగా నరికి కాలువలో పడేశాడు. పశ్చిమ్ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాల్లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బీఎల్ఓ.. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. బీఎల్ఓ రిజ్వాన్ హసన్ మోండల్, అతడికి సహకరించిన సాగర్ గ్యాన్ అనే యువకుడ్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథకం ప్రకారం.. 24 పరగణాల జిల్లా బుదిరియాకు చెందిన నసీర్ అలీ అనే 30 ఏళ్ల యువకుడు సోమవారం రాత్రి నుంచి కనిపించకుండాపోయాడు. అతడి కోసం చుట్టుపక్కల వెతికిన కుటుంబసభ్యులు.. మర్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు.. అలీ ఫోన్‌కు చివరిగా బీఎల్ఓ రిజ్వాన్ నుంచి కాల్ వచ్చినట్టు గుర్తించారు. దీంతో అతడి మొబైల్ ఫోన్, కదలికలు నిఘా పెట్టిన పోలీసులు.. అలీ మృతదేహాన్ని సమీపంలోని ఓ కాలువలో గుర్తించారు.
ప్రాథమిక విచారణలో అలీ భార్య, మోండల్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు వెల్లడయ్యింది. అతడ్ని అరెస్ట్ చేసి తమదైన స్టైల్‌లో పోలీసులు విచారించడంతో తానే ఈ హత్య చేసినట్టు అంగీకరించారు. ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై చర్చించే నెపంతో సోమవారం సాయంత్రం నిర్జన ప్రదేశంలో తనను కలవాలని చెప్పినట్టు అతడు బయటపెట్టాడు. అక్కడకు వచ్చిన తర్వాత చంపి, ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల వాటిని పడేసినట్టు వెల్లడించాడు. కేసులో మోండల్, అతడికి సహకరించిన గ్యాన్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ దారుణాన్ని ఖండిస్తూ.. స్థానికులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం కావాలని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకుని, న్యాయం తప్పకుండా చేస్తామని వారికి నచ్చజెప్పడంతో స్థానికులు ఆందోళన విరమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa