ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు': భారత రాయబార కార్యాలయం

international |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 07:35 PM

సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాలపై జరిగిన క్షిపణి దాడి ఘటనలో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించాడంటూ వచ్చిన వార్తలను అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా ఖండించింది. ఈ ఘటనలో భారతీయులెవరూ ప్రాణాలు కోల్పోలేదని స్పష్టం చేస్తూ.. బాధితుల కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చింది.


అసలేం జరిగిందంటే..?


సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు సమీపంలోని అల్ ఖర్జ్ గవర్నరేట్‌పై ఆదివారం సాయంత్రం ఒక సైనిక ప్రొజెక్టైల్ వచ్చి పడింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు మరణించారని, వారిలో ఒకరు భారతీయుడు, మరొకరు బంగ్లాదేశీయుడు అని సౌదీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రాథమిక సమాచారం ఇచ్చింది. అయితే మృతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సౌదీ అధికారులు తమ నివేదికను సవరించారు.


చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా బంగ్లాదేశ్‌కు చెందిన వారేనని.. మృతుల్లో భారతీయులెవరూ లేరని తాజా విచారణలో తేలింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. "అల్ ఖర్జ్ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు. ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త" అని ఎంబసీ పేర్కొంది.


ఒక భారతీయుడికి గాయాలు.. చికిత్స అందుతోంది!


ఈ భీకర దాడిలో మొత్తం 12 మంది గాయపడగా.. వారిలో ఒక భారతీయ పౌరుడు ఉన్నట్లు ఎంబసీ ధృవీకరించింది. సదరు వ్యక్తికి ప్రస్తుతం అల్ ఖర్జ్ లోని స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. "మేము నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. గాయపడిన మన దేశ పౌరుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాం" అని భారత దౌత్యవేత్తలు వెల్లడించారు.


ముదురుతున్న యుద్ధ సెగలు


పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం నేటితో 10వ రోజుకు చేరుకుంది. ఈక్రమంలోనే సౌదీ అరేబియాలోని వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి. అల్ ఖర్జ్‌లో ఉన్న కీలకమైన వాయుసేన స్థావరమే లక్ష్యంగా ఇరాన్ అనుకూల శక్తులు ఈ ప్రొజెక్టైల్ ప్రయోగించి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ కార్మికుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతానికి మరణ వార్త అవాస్తవమని తేలడంతో లక్షలాది మంది ప్రవాస భారతీయులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa