గృహ అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇకపై ఒక సిలిండర్ పొందిన తర్వాత తదుపరి సిలిండర్ డెలివరీకి కనీసం 21 రోజుల వ్యవధి తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందు ఈ నిరీక్షణ గడువు 15 రోజులుగా ఉండగా, ఇప్పుడు దానిని 21 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ డెలివరీ అయిన తేదీ నుంచి 21 రోజులు పూర్తైన తర్వాతే తదుపరి సిలిండర్ డెలివరీ చేయబడుతుంది.కొత్త నిబంధన అమలు కోసం గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్డేట్ చేశారు. అయితే ప్రస్తుతం బుకింగ్ విధానంలో ఎలాంటి మార్పు లేదు. వినియోగదారులు సిలిండర్ అందుకున్న వెంటనే తదుపరి సిలిండర్ కోసం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ భవిష్యత్తులో 21 రోజులు పూర్తయ్యే వరకు బుకింగ్ చేసుకునే అవకాశం లేకుండా నిబంధనలను కఠినతరం చేయాలని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, 21 రోజులు పూర్తికాకముందే బుకింగ్ చేయడానికి సిస్టమ్ అనుమతించదు.ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడు ఏడాదికి (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) గరిష్టంగా 15 గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు. అందులో 12 సిలిండర్లు సబ్సిడీ ధరకు లభిస్తాయి. అదనంగా 3 సిలిండర్లను సబ్సిడీ లేకుండా (నాన్-సబ్సిడీ ధరకు) కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా, బుక్ చేసిన సిలిండర్లను 24 గంటల్లోపు డెలివరీ చేయాలని చమురు సంస్థలు గ్యాస్ ఏజెన్సీలకు ఆదేశించాయి.అదేవిధంగా దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. మొదటి సిలిండర్ అందిన తర్వాత 21 రోజుల గడువు పూర్తయిన తర్వాతే రెండో సిలిండర్ డెలివరీ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సరిపడా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ వారం బాట్లింగ్ ప్లాంట్లు ఆదివారం కూడా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa