శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధికి దేవ స్థానంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ఈఓ ఎస్ లవన్న అన్నారు. మంగళవారం శ్రీశైలదేవస్థానం పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో వివిధ అంశాలపై దేవస్థానం వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు , ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. భక్తుల సాకర్యార్ధం దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ విరాళాల పథకాలపై మరింత ప్రచారం కల్పించాలని పీఆర్ఓ టి. శ్రీనివాసులుకు సూచించారు. ఆర్జిత సేవ వివరాలు భక్తులకు తెలిసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భక్తులు ఎక్కువ సమయం క్యూలలో వేచిఉండకుండా ఉండేందుకు తగిన కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అనంతరం ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై చర్చించారు. క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనం పెంపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఈఓ ఫణిదర్, హరిదాస్, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్‌కుమార్, డీఈ నరసింహారెడ్డి, సీఎస్‌ఓ నరసింహారెడ్డి, పర్యవేక్షకులు స్వాములు, రాధాకృష్ణ, ఉమేష్ పాల్గొన్నారు.