దశాబ్దాల నాటి భక్తులకల త్వరలో నెరవేరబోతోంది. ఏళ్ళ తరబడి శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయం శరవేగంగా పునర్నిర్మాణమవుతోంది. తిరుపతిలోని వకుళామత దేవాలయం పనులని టిటిడి ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. పనులు అన్ని తుది దశకు చేరుకున్నాయని జూన్ 23న శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణకు ఏర్పాట్లు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి రూరల్ పాతకాల్వ సమీపంలోని పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయం వందేళ్లకు పైగా చరిత్ర కలిగి వుంది. తర్వాత ఆలయం వున్న సంగతి ఎవరికీ తెలీదు. పేరూరు బండపై కాశిరాళ్లతో శిథిలమైన ఓ ఆలయం దర్శనమిచ్చేది. విగ్రహం ధ్వంసం కావడంతో దీన్ని తీసుకెళ్లి కాలువలో పడేశారని స్థానికులు చెబుతారు.
ఈ ఆలయంలోని వకుళామాత అమ్మవారికి నైవేద్యం సమర్పించి గంట మోగించిన తర్వాతే తిరుమలలో వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యం సమర్పించేవారు. అంతటి విశిష్టత వున్న ఆలయం ఏళ్ళ తరబడి జీర్ణోద్ధరణకు నోచుకోలేదు. 2010లో కొందరు భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఆలయాన్ని పునఃనిర్మించాలని 2015లో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆలయానికి 4. 5 ఎకరాలు కేటాయిస్తూ బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. టీటీడీకి ఆ స్థలాన్ని అప్పగించారు. ఇనుప కంచె ఏర్పాటుచేశారు. 2017లో పరిపూర్ణానంద స్వామి ద్వారా భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ తీసుకుని ఆలయ పనులు వేగవంతం చేశారు. పూర్వపు ఆలయ నిర్మాణాన్ని కదపలేదు. పురాతన రాతికట్టడం మీదనే నిర్మాణం పూర్తిచేశారు. ఆలయం ముఖద్వారం వద్ద గాలిగోపురం వుంది. గర్భగుడికి శిఖరం ఏర్పాటు చేసి, రాగితాపడం పనులు పూర్తిచేశారు. రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయం పూర్తయి ప్రారంభమైతే పరిసర ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయంటున్నారు.