సింగరేణి కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం

షేర్ చేయండి:

 లాభాల్లో కార్మికులకు వాటా కోసం పోరాడి10 శాతం వాటా సాధించిన కె.ఎల్‌. మహేంద్ర
 పెన్షన్‌ ప్రదాతగా కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత 
 ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్
 19వ వర్ధంతి సందర్భంగా నేడు శేషగిరి భవన్‌లో ఘన నివాళి

 కొత్తగూడెం సింగరేణి, సూర్య ( మేజర్ న్యూస్):సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన కార్మిక నేత, పెన్షన్‌ ప్రదాత కె.ఎల్‌. మహేంద్ర సేవలు చిరస్మరణీయమని ఎఐటియుసి నాయకులు కొనియాడారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా కల్పించాలన్న డిమాండ్‌పై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నేరుగా పోరాడి 10 శాతం లాభాల వాటా సాధించిపెట్టిన ఘనత కె.ఎల్‌. మహేంద్రకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన 19వ వర్ధంతి సందర్భంగా బుధవారం కొత్తగూడెం శేషగిరి భవన్‌లో ఎఐటియుసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించాచారు. ఈ సందర్భంగా వంగ వెంకట్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ నష్టాల్లో ఉంటే ఆ భారాన్ని కార్మికులపై మోపాలని ప్రభుత్వం భావించిన సమయంలో కె.ఎల్‌. మహేంద్ర కార్మికుల తరఫున గళమెత్తారని ఆయన గుర్తుచేశారు. సంస్థకు నష్టాలు వస్తే కార్మికుల జీతాలు కోత విధిస్తామనే విధానం ఉన్నప్పుడు. అదే సంస్థ లాభాల్లో నడిచినప్పుడు ఆ లాభాల్లో కార్మికులకు కూడా వాటా ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కార్మికుల పక్షాన చర్చలు, పోరాటాలు సాగించి చివరకు సింగరేణి కార్మికులకు 10 శాతం లాభాల వాటా సాధించడంలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.సింగరేణి కార్మికుల భవిష్యత్‌ భద్రత కోసం పెన్షన్‌ సౌకర్యం కల్పించడంలోనూ కె.ఎల్‌. మహేంద్ర విశేష కృషి చేశారని నాయకులు తెలిపారు.కార్మికుడు పనిచేసే కాలంలోనే కాకుండా పదవీ విరమణ అనంతరం కూడా గౌరవప్రదమైన జీవితం సాగించేందుకు పెన్షన్‌ ఎంతో అవసరమని భావించి దాని సాధన కోసం ఆయన ఉద్యమించారని గుర్తుచేశారు. అందుకే కార్మిక లోకంలో ఆయనను పెన్షన్‌ ప్రదాతగా గౌరవంగా స్మరించుకుంటున్నామని తెలిపారు.సింగరేణి కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, హక్కుల సాధన కోసం కె.ఎల్‌. మహేంద్ర చేసిన పోరాటాలు నేటి కార్మిక ఉద్యమానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. కార్మికుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వాలు, యాజమాన్యాలతో పోరాడిన ఆయన సేవలను స్మరించుకోవడం ప్రతి కార్మికుడి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు రమణమూర్తి,గట్టయ్య, ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్‌,సహాయ కార్యదర్శి రాము, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్ , నాగయ్య,పిట్ కార్యదర్శిలు మధు కృష్ణ,భుక్య రమేష్,కమల్,సురేందర్,నాయకులు మాతంగి లింగయ్య ,బండారి మల్లయ్య, మండల రాజేశ్వరరావు,సాధనాల రమేష్, సోమయ్య,రమేష్,నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.