విశాఖపట్నం: టి.అర్జాపురంలో పశుగ్రాసం కోయడానికి వెళ్లిన మరిశా హరికృష్ణ (18)పై విద్యుత్తు తీగలు తెగి పడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కొత్తకోట ఎస్సై బి.అప్పలనాయుడు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఈ గ్రామానికి చెందిన రైతు మరిశా ముసిలినాయుడు, జోగిలక్ష్మి దంపతులకు ఇద్దరు మగపిల్లలు. పెద్ద కొడుకు హరికృష్ణ ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. డిగ్రీలో చేరనున్నాడు. కొడుకులిద్దరూ ఓపక్క చదువుతూనే వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయపడుతుంటారు. ఆదివారం సాయంత్రం హరికృష్ణ కొట్నాబిల్లికి వెళ్లే రోడ్డులోని పొలాల్లో గడ్డి కోస్తున్నాడు.
టి.అర్జాపురం నుంచి కొట్నాబిల్లి ప్రాంతంలోని ఐదు గిరిజన గ్రామాలకు విద్యుత్తును సరఫరా చేసే 11 కె.వి విద్యుత్తు తీగలు తెగి గడ్డికోస్తున్న హరికృష్ణపై పడి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తండ్రి ముసిలినాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. ఏఈ నందన్ మాట్లాడుతూ.. తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, ఈ ప్రాంతంలో తీగలు వేలాడుతున్నట్లు తన దృష్టికి రాలేదని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.