రోడ్డుపై నిరసన కారులే కాదు బాతులు బైఠాయించినా ఇబ్బందులు తప్పవు. ఈ విషయాన్ని స్వయంగా బాతులే తమ చర్యలతో స్పష్టంచేశాయి. రోడ్లపై వెళుతున్నప్పుడు అక్కడక్కడా జంతువులు అడ్డం రావడం మన ఇండియాలో మామూలే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది తరచూ జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి బాతుల గుంపులు కూడా రోడ్డుపై అడ్డువస్తూ ఉంటాయి. వాటిని కాసే వారు బాతులను ఓ పక్కగా అదిలించి.. వాహనాలకు రోడ్డును క్లియర్ చేస్తూ ఉంటాయి. కానీ ఇటీవల ఓ రోడ్డుపై కారును బాతులు చుట్టుముట్టి తిరిగిన ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
తెలుపు రంగులో ఉన్న ఓ కారు రోడ్డుపై వెళుతుండగా పెద్ద బాతుల గుంపు అడ్డువచ్చింది. వందల సంఖ్యలో ఉన్న బాతులు రోడ్డంతా ఆక్రమించుకుని కదులుతున్నాయి. అయితే కారును నడుపుతున్న వ్యక్తి హారన్ కొడుతూ, వాటిని అదిలిస్తూ కొంత ముందుకు వచ్చాక.. పూర్తిగా ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. బాతులు ముందుకో, వెనక్కో కదలడం ఆపేసి.. ఆ కారు చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. ఒకటి రెండు కాదు వందల బాతులు చుట్టూ తిరుగుతుండటంతో కారు అక్కడే ఆగిపోయింది. ముందు వైపు నుంచి వస్తున్న కారులోని ఓ వ్యక్తి దీనంతటినీ వీడియో తీసి.. రెడ్డిట్ వెబ్ సైట్లో పోస్ట్ చేశారు. అయితే అది ఎక్కడ జరిగిందనేది పేర్కొనలేదు.
అయితే బాతులు కారును చుట్టేస్తున్న దృశ్యం ముచ్చటగా ఉండటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వేల మంది దీనికి లైక్ కొట్టారు. ‘తమను డిస్టర్బ్ చేసినందుకు బాతుల బృందం మాట్లాడుకుని ఆపేసింది’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘ఒక బాతు వెనుక మరో బాతు నడుస్తున్నాయి. అలా అది గుండ్రంగా మారిపోయింది..’ అని మరికొందరు వివరిస్తున్నారు.