బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై అదే రాష్ట్రంలో పలుమార్లు దాడులకు యత్నం జరిగింది. తాజాగా సీం నితీశ్ కుమార్ కాన్వాయ్ పై పాట్నాలో రాళ్ల దాడికి సంబంధించి 13 మందిని అరెస్టు చేసినట్లు పాట్నా ఏఎస్స్పీ తెలిపారు. ఆదివారం పాట్నా- గయ మార్గంలో గౌరీచక్‌లోని సోహ్గి గ్రామంలో ఆందోళనకారులు మూకుమ్మడి దాడికి దిగడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ కి చెందిన మూడు, నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి కాన్వాయ్ లో లేరు. అయితే, భద్రతా సిబ్బంది కార్లలో ఉన్నారు.
సోమవారం సీఎం పర్యటన కోసం ఆదివారం సాయంత్రం కాన్వాయ్ ను గయకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బీహార్ సీఎం హెలికాప్టర్‌లో గయకు చేరుకోవాల్సి ఉంది. ఆయన భద్రతలో భాగమైన వాహనాలు ఒక రోజు ముందుగానే వెళ్లాయి. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు-మూడు రోజులుగా తప్పిపోయిన యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కోపోద్రిక్తులైన ఆందోళన కారులు పాట్నా- గయ రహదారిని దిగ్బంధించారు.
ఈ క్రమంలో సీఎం కాన్వాయ్ కనిపించడంతో దానిపై రాళ్ల దాడి చేశారు. వెంటనే పోలీసు బలగాలను ఆ ప్రాంతానికి పంపించి, గుంపును చెదరగొట్టారని ఆయన చెప్పాడు. 15 మందిపై కేసు నమోదు చేయగా, వారిలో 13 మందిని అరెస్టు చేశారు. కాగా, నితీశ్ కుమార్ సోమవారం గయలో పర్యటిస్తారు. అక్కడ నిర్మిస్తున్న రబ్బరు డ్యామ్‌ను పరిశీలించి, జిల్లాలో కరవు పరిస్థితులపై జరిగే సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.