మనదేశంలో బంగారం ధరలు ఎంతకీ తగ్గకపోగా రోజురోజుకు పైకి ఎగబాకుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు సమీప కాలంలో బలహీనంగా ఉండొచ్చన్నది విశ్లేషకుల అంచనా. డాలర్ బలంగా ఉండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రానున్న రోజుల్లోనూ రేట్లను పెంచే అవకాశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు. బంగారం ధర దేశీ మార్కెట్లో 24 క్యారెట్లు రూ.51,800 (10 గ్రాములు), 22 క్యారెట్లు రూ.47,450 (10 గ్రాములు)గా ఉంది. స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ (28.34 గ్రాములు) 1,747.55 డాలర్లుగా ఉంది.
అయితే, బంగారం ధర మరీ దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు కూడా లేవంటున్నారు విశ్లేషకులు. ‘‘ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ అమ్మకాలు చూస్తున్నాం. అలాగే, బాండ్లు, కరెన్సీల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి’’ అని ఏసీవై సెక్యూరిటీస్చీఫ్ ఎకనమిస్ట్ క్లిఫోర్డ్ బెన్నెట్ తెలిపారు. బంగారం ధరలు అమెరికా వడ్డీ రేట్లకు అనుగుణంగా ఎక్కువగా ప్రభావితమవుతాయి. వడ్డీ రేట్ల పెరుగుదలతో బంగారంలో పెట్టుబడుల వ్యయాలు ఇన్వెస్టర్లకు పెరిగిపోతాయి. సెప్టెంబర్ సమీక్షలో ఫెడ్ వడ్డీ రేటును అర శాతం పెంచొచ్చని తెలుస్తోంది. కనుక బంగారంలో ఇన్వెస్ట్ చేసే వారు వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.