భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో గురువారం స్వామి వారి ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆరాధ్య దైవమైన రంగనాయకుల గుట్టపై వేంచేసి ఉన్న శ్రీరంగనాథ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున 4. 30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాదులు నిర్వహించారు.
అనంతరం శ్రీసీతా, రామ, లక్ష్మణ ఉత్సవమూర్తులను ప్రాకార మండపంలో వేంచేపు చేసి ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం చేశారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణ నడుమ కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుకతో శాస్త్రోక్తంగా నిత్యకళ్యాణం వైభవంగా జరిపించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు