ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరాటే లభించిందని చెప్పాలి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసుల విచారణకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసుల విచారణ ఇకపై రోజువారీగా జరగనుంది. ఈ విచారణకు అన్ని కేసుల్లో ప్రథమ నిందితుడిగా ఉన్న జగన్ తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని సీబీఐ కోర్టు పేర్కొంది. ఈమేరకు కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు విచారణల నుంచి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. తన బదులుగా తన న్యాయవాది విచారణకు హాజరవుతారని, అందుకు అంగీకరించాలని తన పిటిషన్‌లో జగన్ అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు... సీబీఐ కోర్టు విచారణలకు జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిచ్చింది.
జగన్ కు బదులుగా ఆయన తరఫు న్యాయవాదిని విచారణకు అనుమతించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా జగనే స్వయంగా ఈ కేసు విచారణలకు హాజరుకావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టు తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలన్న సమయంలో మాత్రం జగన్ కోర్టు విచారణకు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది.