ఏపీలోని తెనాలిలో తెలంగాణ మంత్రి దర్శనమిచ్చారు. ఎందుకో తెలుసా...? వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఏపీలో పర్యటించారు. గురువారం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లిపరలో అరటి క్షేత్రాన్ని, తెనాలి వ్యవసాయ మార్కెట్‌లో అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌ను సందర్శించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మంత్రి వెంట ఉన్నారు. తెలంగాణలో అన్నదాతలను సంపన్నులుగా చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. తెనాలిలో రైతులు విత్తనాలు వేసుకోవడానికి ముందే అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లలో పరీక్షలు చేయించడం అభినందనీయమని కితాబిచ్చారు. రైతాంగానికి ఇది ఎంతో మేలు అని.. తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
వల్లబాపురంలో ఉద్యానవన పంటలను, పొలాల్లోకి వెళ్లి పంటలను మంత్రి పరిశీలించారు. ఏ పంటలు వేస్తారు, పంటలు పండటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆరా తీశారు. దిగుబడిపై రైతులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యానవన పంటలు,సేంద్రీయ వ్యవసాయ గురించి ఆరా తీశారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో వైఎస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌ని సందర్శించారు. ల్యాబ్‌ని పరిశీలించి మంత్రి ల్యాబ్ టెస్టులు, రైతులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయపై గతంలో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో సందర్శించామన్నారు.
ప్రతి రైతు సేంద్రీయ వ్యవసాయపై దృష్టి పెట్టాలన్నరు మంత్రి. వ్యవసాయంపై రైతుల అభిప్రాయాలను తీసుకొని అధ్యయనం చేస్తామని.. సేంద్రియ సంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చెయ్యటం చేస్తే అధిక దిగుబడి, మంచి ధరలు వస్తాయన్నారు. వ్యవసాయంలో రాబోయే రోజుల్లో ఆహార ఉత్పత్తులు పండించటంలో దేశానికి గొప్ప భవిష్యత్ ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కూడా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ టెస్టులు ఏర్పాటుకు పరిశీలన చేస్తామన్నారు.