సినిమా సీన్ ను తలపించి సీన్ నిజజీవితంలోనూ దర్శనమిచ్చింది. అందుకు నెల్లూరు నగరం వేదికైంది. భారీ దోపిడీకి స్కెచ్ వేసిన దొంగలు.. ఐటీ అధికారుల్లా టిప్‌టాప్‌గా తయారై ఓ నగల దుకాణంలోకి చొరబడ్డారు. షాపులోకి దూరిన తర్వాత సోదాలు చేయాలంటూ హడావుడి చేశారు. లెక్కల్లో చూపలేదని చెప్పి 12 కిలోల బంగారు ఆభరణాలను మూటగట్టి ఉడాయించేందుకు సిద్ధమయ్యారు. అయితే, వారి ప్రవర్తనపై దుకాణంలోని సిబ్బందికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చివరి నిమిషంలో వారి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసుల రాకతో షాకైన కేటుగాళ్లు.. పరారీకి ప్రయత్నించారు. కానీ, స్థానికుల సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సినిమాను తలపించిన ఈ ఘటన నెల్లూరు నగరంలో చోటుచేసుకుంది.
నెల్లూరు నగరం చిన్నబజార్ కాకర్ల వారి వీధిలో ఉన్న లావణ్య జ్యువెల్లరీ షాపులోకి శుక్రవారం ఓ ఆరుగురు వ్యక్తులు ప్రవేశించారు. తాము ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి నకిలీ ఐడీ కార్డులు చూపించి, తనిఖీలు చేయాలని నానా హంగామా చేశారు. రికార్డులను తనిఖీ చేసి లెక్కల్లో కంటే ఎక్కువ బంగారం ఉందని చెప్పి సుమారు రూ.కోటిన్నర విలువైన 12 కిలోల బంగారాన్ని బ్యాగుల్లో నింపి పరారయ్యేందుకు యత్నించారు.
అయితే, వారి తీరుపై దుకాణంలోని సిబ్బందికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో పరారయ్యేందుకు ప్రయత్నించిన దొంగలను స్థానికుల సహకారంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టపగలే ఐటీ అధికారుల పేరుతో భారీ దోపిడీకి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఆరుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. నిందితులపై కేసు నమోదుచేశారు.