భారీ వర్షాల కారణంగా అన్నమయ్య జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహించాయి. అయితే, అర్ధరాత్రి వేళ నీటి ఉధృతిని అంచనా వేయలేకపోయిన ఓ కారు వాగులో వెళ్తూ గల్లంతయింది. ఆస్పత్రికి వెళ్లి బెంగళూరు నుంచి తిరిగొస్తున్న కుటుంబం మొత్తం వాగులో కారుతో సహా గల్లంతవడంతో.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటకి చెందిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ రమణ కుటుంబం బెంగళూరు ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చూయించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో భారీ వర్షాలకు సంపతికోట వద్ద వాగు ఉధృతంగా ప్రవహించింది. అయితే, వాగును దాటే సమయంలో కారు డ్రైవర్ అలానే ముందుకు పోనివ్వగా.. నీటి ఉధృతికి కారు వాగులో గల్లంతయింది. దాంతో రమణ కుటుంబ సభ్యులు స్థానికులకు ఫోన్ చేసి కాపాడాలని సమాచారం అందించారు.
ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు మొత్తం నలుగురు ఉన్నారు. వాగులో కారు గల్లంతవ్వడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. కొత్తకోట, పెద్దతిప్పసముద్రం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో కారును ఒడ్డుకు చేర్చారు. అయితే కారులో రమణతో పాటు మరో ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. బీటెక్ చదువుతున్న కూతురు మౌనిక గల్లంతయింది. మౌనిక (22) కోసం పోలీసులు రాత్రి గాలింపు చేపట్టగా.. ఇవాళ ఉదయం ఆమె మృతదేహం లభ్యమైంది.