పవన్ కల్యాణ్‌కు కథ, స్క్రీన్ ప్లే చంద్రబాబు వహిస్తుంటే.. డైరెక్షన్ మాత్రం నాదెండ్ల మనోహర్ చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కేఏ పాల్‌కి, పవన్ కల్యాణ్‌కి తేడా లేదని.. ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఏపీలో సీట్లు లేవని వ్యగ్యంగా విమర్శించారు. జాకీలు పెట్టి లేవలేని చంద్రబాబును నువ్వు మోయగలవా పవన్ కల్యాణ్ అంటూ సెటైర్లు విసిరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జోగి రమేశ్ సవాల్ చేశారు. పొత్తులతో పొర్లాడటం తప్పించి ప్రజలకు మీరేం చేశారంటూ పవన్ కల్యాణ్‌ని నిలదీశారు.
ఏపీలో టీడీపీపై తిరుగుబాటు మొదలైందని.. చంద్రబాబు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో జరిగిన ఘటనలో అందుకు నిదర్శనమన్నారు. కుప్పంలో బీసీల నుంచే చంద్రబాబుకు తిరుగుబాటు ఎదురైందని.. టీడీపీని కూకటి వేర్లతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. తమను ఇన్నాళ్ల పాటు బానిసలుగా చేసుకున్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని కుప్పంకి వస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. టీడీపీ దీనికి సమాధానం చెప్పాలని మంత్రి అడిగారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి 175 నియోజకవర్గాల్లోనూ ఓటమి తప్పదని జోగి రమేశ్ జోస్యం చెప్పారు.