మాజీ మంత్రి, దివంగత పరిటాల రవికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళ్లులర్పించారు. ఇదిలావుంటే పరిటాల రవి జయంతిని పురష్కరించుకొని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనను స్మరించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఆయనకు నివాళి అర్పించారు. సీమ నేలపై రౌడీ రాజకీయాలకు చెక్ పెట్టి, ప్రజాకంటకుల వాకిళ్లలో పసుపు జెండాను రెపరెపలాడించి... పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను అందించిన ధీశాలి పరిటాల రవి అని చంద్రబాబు కొనియాడారు. జీవితమంతా ప్రజల కోసమే బతికిన ఆత్మీయుడు పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు.
నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఫ్యాక్షనిజం పడగలో సామాన్యుల బతుకులు ఛిద్రమైపోతున్న వేళ... పేదల పక్షాన నిలిచి పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాంతంత్ర్యాలను ప్రసాదించిన వ్యక్తి పరిటాల రవి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతగా రాయలసీమ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన పరిటాల రవి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు.
1958 ఆగస్ట్ 30 అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామంలో పరిటాల రవి జన్మించారు. 1993 జూన్ 7న రవి టీడీపీలో చేరారు. 1994 జూన్ 17న వైయస్ రాజారెడ్డి వెంకటాపురంకు వెళ్లి పరిటాల రవిని కలవడం అప్పట్లో సెన్సేషన్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందిన రవి... ఎన్టీఆర్ కేబినెట్ లో కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. 2005 జనవరి 24న అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో ప్రత్యర్థులు ఆయను హతమార్చారు. జిల్లాలోని టీడీపీ కీలక నేతలందరూ అక్కడే ఉన్న సమయంలో ఆయనపై బుల్లెట్ల వర్షం కురిసింది. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.