ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవుతూనే ఉంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు తాజాగా కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అనంతబాబు బెయిల్ పిటిషన్ ను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన బెయిల్ పిటిషన్ కోర్టులో తిరస్కరణకు గురికావడం ఇది మూడోసారి. నిర్దేశిత సమయంలో పూర్తి చార్జిషీట్ వేయనందున తనకు బెయిల్ ఇవ్వాలని అనంతబాబు కోర్టును కోరారు. అయితే కోర్టు అతడి విజ్ఞాపనను తోసిపుచ్చింది.
తల్లి మరణం నేపథ్యంలో అనంతబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి మరణించడంతో కోర్టు 3 రోజుల కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొడిగించాలంటూ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించగా సెప్టెంబరు 5 వరకు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, బెయిల్ షరతులపై కిందికోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా పాటించాలని అనంతబాబుకు స్పష్టం చేసింది. త్వరలోనే హైకోర్టు పొడిగించిన బెయిల్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే, మరోసారి బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, రాజమండ్రి కోర్టులో నిరాశ తప్పలేదు.