గణపతి పండుగ వచ్చిందంటే దేశవ్యాప్తంగా కోలాహలం ప్రారంభం అవుతుంది. వినాయకుడు భాద్రపద శుక్ల పక్షం చతుర్థి తిథి నాడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 31, 2022న వినాయక చవితిగా పండితులు నిర్ణయించారు. హిందువులకు వినాయక చవితి తొలి పండుగగా అభివర్ణిస్తుంటారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణనాథుని పూజిస్తారు. వీధుల్లో ఎంతో సంబరంగా పందిళ్లు వేసి, గణపతి నవరాత్రులను వేడుకగా జరుపుకుంటారు. ప్రథమ పూజను అందుకునే వినాయకుడంటే అందరికీ ఎంతో భక్తిభావం. అదే విధంగా భక్తుల పట్ల వినాయకుడికి కూడా ఎంతో వాత్సల్యం. ఎంతో ప్రాధాన్యత కలిగిన వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకుందాం.
పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఓ సారి దేవతలంతా కలిసి వచ్చి పార్వతీపరమేశ్వరులను పూజిస్తారు. ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు విఘ్నాలు రాకుండా తాము పూజించడానికి ఓ దేవుడిని నియమించాలని శరణు వేడుతారు. అక్కడే ఉన్న పార్వతీపరమేశ్వరుల తనయులు వినాయకుడు, కార్తికేయుడు(కుమారస్వామి) తమను నియమించాలంటూ ముందుకొస్తారు. వారిరువురికీ పరమేశ్వరుడు ఓ పరీక్ష పెడతాడు.
ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలను చుట్టి, వాటిలోని పుణ్యనదులలో స్నానమాచరించి, కైలాసానికి ముందుగా చేరుకుంటారో వారిని నియమిస్తానని పరమేశ్వరుడు చెబుతారు. నెమలి వాహనంపై కార్తికేయుడు బయల్దేరతాడు. అయితే గణనాథుడు నారాయణ మంత్రం జపించి, పార్వతీపరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అలా చేస్తే ముల్లోకాలను దర్శించి, నదులలో పుణ్యస్నానమాచరించిన ఫలితం దక్కుతుంది. కార్తికేయుడు ముల్లోకాలను చుట్టి రాగా, అప్పటికే గణనాథుడు పార్వతీపరమేశ్వరులను పూజిస్తూ ఉంటాడు. దీంతో విఘ్నాలను తొలగించే దేవుడిగా వినాయకుడిని పరమేశ్వరుడు నియమిస్తారు. విఘ్నాలను తొలగించే దేవుడిగా భాద్రపద శుక్ల చతుర్దశి రోజున వినాయకుడు పూజలు అందుకోవడంతో అప్పటి నుంచి వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకునే సంప్రదాయం అనాదిగా వస్తోంది.
కార్యక్రమమేదైనా ప్రథమ పూజ అందుకునే వినాయకునికి పూజించే సమయంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి. తులసి ఆకులను, ఎండిపోయిన పూవులను ఉపయోగించకూడదు. ఆసనంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఆసనానికి పసుపు రాసి దానిపై బియ్యం పోయాలి. కుంకుమతో బొట్టు పెట్టి, వినాయకుడి తలపై వచ్చేలా పాలవెల్లిని ఏర్పాటు చేయాలి. దురు ముక్కలతో పందిరిలా కట్టి దానికి పండ్లు, వెలగ కాయ, మొక్కజొన్న కండెలు, పూలు కట్టి అందంగా అలంకరించాలి.
నైవేద్యం కోసం గారెలు, పాయసం, ఉండ్రాళ్లు, కుడుములు అక్కడ పెట్టుకోవాలి. రాగి లేదా వెండి చెంబుకి పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలశాన్ని, పూజ చేయాలి. 21 రకాల ఆకులతో పత్రి నైవేద్యం చేయాలి. లేకుంటే వాటితో సమానమైన దర్భలతో పూజించాలి. 21 పత్రాలతో ఏక వింశతి పూజ, అష్టోత్తర నామావళి చెప్పిన తర్వాత వినాయక వ్రత కథ చదవాలి. చివర్లో వినాయక దండకం చదివి, గణనాథునికి నైవేద్యం అర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది. ఆఖరులో పూజకు ఉపయోగించిన అక్షతలను తలపై వేసుకోవాలి.