ఎన్నికల్లో నెహ్రు కుటుంబం ఓడితే భారత్ విచ్చిన్నమైనట్లు కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసి ఎలాగైనా విజయన్నాందుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని, భారత్ ను ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెబుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిమీ పాదయాత్ర చేయనున్నారు.
ఒకరకంగా రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉన్న భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న ప్రారంభం కానుంది. 12 రాష్ట్రాల గుండా ఈ పాదయాత్ర సాగనుంది. దీనిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొన్నారు.
"నెహ్రూ కుటుంబం ఎన్నికల్లో గెలవలేకపోయిందంటే అందుకు కారణం భారత్ విచ్ఛిన్నమైందని కాదు. భారత్ ఎప్పుడూ విచ్ఛిన్నం కాలేదు, ఇప్పుడూ విచ్ఛిన్నంగా లేదు, ఇకముందూ విచ్ఛిన్నం కాబోదు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పాదయాత్ర పేరును కాంగ్రెస్ పార్టీ 'మృత్యువుకు ముందు తుదిశ్వాస' అని మార్చుకుంటే బాగుంటుంది" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.