ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు జవాబుదారీ పాలన గురించే తొలుత ఆలోచించా: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 08:19 PM

తొలిసారి సీఎం అయినప్పుడు తాను మొదట ఆలోచించింది ప్రజలకు జవాబుదారీ పాలన అందించడం గురించేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పాలకులు అంటే ప్రజలకు సేవకులు అని ఎన్టీఆర్ చెప్పారని, ఆయన నినాదాన్ని అమల్లోకి తెచ్చేందుకే ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చామని తెలిపారు. తద్వారా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేశామని వివరించారు. అది ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచిందని, జన్మభూమి వంటి కార్యక్రమాలతో ప్రజలను కూడా పాలనలో భాగస్వాములు చేయడం జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.  విపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన 14 ఏళ్ల ప్రస్థానంపై స్పందించారు. ముఖ్యమంత్రిగా తాను మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు (సెప్టెంబరు 1) ఇది అని వెల్లడించారు. నేటికి సరిగ్గా 27 ఏళ్ల కిందట, 1995 సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. నాటి నుంచి సుమారు 14 ఏళ్లు సీఎంగా వ్యవహరించానని వివరించారు. 


ఏపీ ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు, మరెన్నో కీలక మలుపులు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రయాణాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే.... ఒక పని సాధించాలంటే ఒక విజన్ తో కూడిన స్పష్టమైన ప్రణాళిక అవసరం అని, అలాగే ఒక రాష్ట్రానికి కూడా దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడ్డారు. తాను రూపొందించిన విజన్-2020 అనే డాక్యుమెంట్ అందుకు నిదర్శనం అని తెలిపారు. అప్పట్లో ఎగతాళి చేసినవారే ఆ తర్వాత విజన్ డాక్యుమెంట్ ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నారని స్పష్టం చేశారు. 


మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను ఏపీకి తీసుకువచ్చి ప్రపంచ ఐటీ రంగం దృష్టి రాష్ట్రంపై పడేలా చేశామని, తద్వారా లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. ఐటీ ఉద్యోగాలకు నిపుణులను సిద్ధం చేసేందుకు పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ కాలేజీను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అంతేకాకుండా, విద్యారంగంలో సమూల మార్పులు చేసి విద్యను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేశామని, నాడు పడిన కష్టానికి ఫలితంగా ఇవాళ ఒక రైతు బిడ్డ నుంచి ఒక కార్మికుని కొడుకు వరకు దేశవిదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తారని ఉద్ఘాటించారు. 


ఈరోజు అమెరికాలో ఎక్కువ ఆదాయం పొందుతున్న భారతీయుల్లో 20 శాతం మంది తెలుగువారేనన్న మాట విన్నప్పుడు తనకెంతో తృప్తిగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పట్లో ఒక పదేళ్లపాటు ఎవరి నోట విన్నా ఆంధ్రప్రదేశ్ మాటే వినిపించేదని, రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు, సంస్థలు దేశం దృష్టిని ఆకర్షించాయని వివరించారు. 


"పెరుగుతున్న మన అవసరాలు తీరాలంటే సంపద సృష్టి జరగాలన్నది ఆనాడు నేను చేసిన మరో ఆలోచన. ఏపీకి తరలి వచ్చే సంస్థల కోసం మౌలిక రంగ అభివృద్ధి చేశాం. అత్యుత్తమ విధానాలను తీసుకువచ్చాం. అందుకు ఉదాహరణ సైబరాబాద్ నగర నిర్మాణం. ఇప్పుడు సైబరాబాద్ దేశవిదేశాల్లోని అనేక సంస్థలకు కీలక వేదికగా నిలిచింది. ఇక, కొన్ని రంగాల్లో సంస్కరణలు చాలా అవసరం అనిపించింది. అదే సమయంలో నా ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే వాజ్ పేయి గారు ప్రధాని పదవిలో ఉండడం కలిసొచ్చింది. 


జాతీయస్థాయిలో ఓపెన్ స్కై పాలసీ, టెలికా పాలసీ, స్వర్ణ చతుర్భుజి రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, మైక్రో ఇరిగేషన్ వంటివి దేశానికి పరిచయం చేయడంలో కీలకపాత్ర పోషించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను. అబ్దుల్ కలాం వంటివారిని రాష్ట్రపతిగా ఎంపిక చేసుకోవడంలో నా పాత్ర ఉండడం మధుర జ్ఞాపకం. రంగరాజన్ వంటివారిని ఏపీకి గవర్నర్ గా తీసుకువచ్చాం. 


టీడీపీ నేతల్లో బాలయోగి గారిని దేశంలో తొలి దళిత స్పీకర్ గా, ఎర్రన్నాయుడు గారిని కేంద్రమంత్రిగా చేసుకుని టీడీపీ ఆత్మగా ఉండే సామాజిక న్యాయాన్ని మరింత విస్తృతం చేయగలిగాం. రాష్ట్ర విభజన తర్వాత 2014లో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలు బాధ్యత ఇవ్వగా... లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించి చూపించాం. అమరావతిని ప్రపంచస్థాయి రాజధాని నగరంగా నిర్మించేందుకు కృషి చేశాం. 


కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం ద్వారా నదుల అనుసంధానం అనే కీలక ప్రక్రియను మొదలుపెట్టాం. అన్న క్యాంటీన్, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్, విదేశీ విద్య, చంద్రన్న బీమా వంటి వినూత్న పథకాలతో పేదలకు అండగా నిలిచాం. ముఖ్యమంత్రిగా నేను ఏం చేసినా భావితరాల ఉజ్వల భవిష్యత్తే నా లక్ష్యం అయింది. దాదాపు 14 సంవత్సరాల పాలనా కాలంలో ముఖ్యమంత్రిగా నేను సాధించిన విజయాలు నావి కావు... అవి తెలుగు ప్రజల విజయాలు. నేను కేవలం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, అధికారాన్ని వారికి మంచి చేసేందుకు సద్వినియోగం చేసుకున్నానంతే" అంటూ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com