ఆరు నెలల కూటమి పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనమైందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బడి లేదు.. విద్యార్థులకు భవిష్యత్తూ లేదన్నారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రవిచంద్రతో కలిసి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. మహానేత వైయస్ఆర్ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కేసింది.
2004కి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో పాదయాత్రలో చూసిన పరిస్థితులతో చలించిపోయి మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఫీజులు చెల్లించలేక పిల్లలు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విద్యా విప్లవం తీసుకొచ్చారు. ఆ పథకం ఎందరో విద్యార్థుల జీవితం మార్చింది. ఎందరో సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మళ్లీ 2004కి ముందు పరిస్థితులను తీసుకొచ్చారు అని వాపోయారు.