ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమైన మన దేశం మున్ముందు కూడా భారీ వర్షాలను ఎదుర్కోకక తప్పదని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ లో జూన్ మొదట్లో ప్రవేశించే నైరుతి రుతుపవనాలు దేశంలోని చాలా భాగాల్లో అత్యధిక వర్షపాతం కలుగజేస్తాయి. ఈ రుతుపవనాలు సాధారణంగా సెప్టెంబరు 17 నుంచి తిరోగమనం ప్రారంభిస్తాయి. ఆపై, దేశంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలవుతుంది. అయితే, ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే తిరోగమిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆగస్టు 25న ప్రకటించింది. ఇప్పుడా ప్రకటనను ఐఎండీ సవరించింది. నైరుతి రుతుపవనాల ముందస్తు తిరోగమనానికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. సెప్టెంబరులోనూ నైరుతి రుతుపవనాల కారణంగా గణనీయస్థాయిలో వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రుతుపవన ద్రోణి సెప్టెంబరు 7 నాటికి దక్షిణ దిశగా పయనిస్తుందని, దాంతో మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందని మహాపాత్ర వివరించారు.