మనదేశ చరిత్రలో అరుదైనిదిగా భావిస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్ అందుబాటులోకి వచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ కార్యాచరణలో భాగంగా, దేశీయంగా రూపొందించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. కేరళలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ కొచ్చిన్ షిప్ యార్డ్ లో జరిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కు ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతీకగా నిలుస్తుందని అభివర్ణించారు. ఇవాళ భారతదేశం కూడా సొంతంగా విమాన వాహక నౌకలు నిర్మించగలిగిన దేశాల జాబితాలో చేరిందని వెల్లడించారు. విక్రాంత్ రంగప్రవేశంతో భారతదేశ ఆత్మవిశ్వాసం ఇనుమడించిందని తెలిపారు. విదేశాలకు తలొగ్గి ఉండాల్సిన అగత్యాన్ని ఈ సరికొత్త వాహక నౌక తొలగించిందని అన్నారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలు ఇలావున్నాయి. దీని పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు. దీని బరువు 45 వేల టన్నులు. రూ.20 వేల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ భారీ వాహక నౌకపై మిగ్-29కే, హెలికాప్టర్లు సహా 30 యుద్ధ విమానాలు నిలపవచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ పై 1,600 మంది సిబ్బంది ఉంటారు. ఇది 28 కిలోనాట్ల వేగంతో పయనించగలదు. ఇందులోని 4 గ్యాస్ టర్బైన్ ఇంజిన్లు 24 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలవు. ఇందులో ఆర్ఏఎన్-401 3డీ ఎయిర్ సర్విలెన్స్ రాడార్, ఎంఫ్-స్టార్, టీఏసీఏన్, రెజిస్టోర్-ఇ ఏవియేషన్ కాంప్లెక్స్, శక్తి ఈడబ్ల్యూ సూట్, డైవర్ డిటెక్షన్ సిస్టమ్ తదితర వ్యవస్థలు పొందుపరిచారు. ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి భారీ నౌకకు స్వీయరక్షణ కూడా అవసరమే. అందుకే దీంట్లో కవచ్ ఛాఫ్ డెకాయ్ సిస్టమ్, టోర్పెడో డెకాయ్ సిస్టమ్ లు ఏర్పాటు చేశారు. బరాక్-8 శామ్ మిస్సైళ్లు, ఎకే-630 ఫిరంగులు, రిమోట్ ఆధారిత తుపాకులు దీంట్లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa