రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికతో సన్నద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే సంప్రదించేందుకు వీలుగా ప్రతి పీహెచ్‌సీ వైద్యుడికి మొబైల్ ఫోన్లు అందజేయనున్నారు. గ్రామ సచివాలయాల్లోనూ వైద్యులు బయోమెట్రిక్ హాజరుకు వీలు కల్పిస్తున్నారు.
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెలీమెడిసిన్ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం ఇప్పటికే రాష్ట్రంలో ఉంది. టెలీ మెడిసిన్ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం ద్వారా సచివాలయం యూనిట్‌గా ప్రతి గ్రామాన్ని పీహెచ్‌సీ వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు వైద్యుడు గ్రామానికి రాని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను ప్రభుత్వం సమకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో 2,300 ఫోన్లను అందచేస్తోంది. ఫోన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తై పంపిణీ కొనసాగుతోంది. ఒకవేళ వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయిస్తోంది.