ఉత్కంఠభరితంగా సాగిన బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్ దాదాపు 21 వేల ఓట్లతో గెలుపొందిన తర్వాత..ఆ దేశ హోం మంత్రి ప్రీతి పటేల్ ఊహించని షాకిచ్చింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది. కొత్త ప్రధానిగా ఎంపికైన లిజ్ ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రీతి, దేశ ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తన స్థానంలో కొత్త హోం మంత్రి వస్తారని తెలిపింది. లిజ్ ట్రస్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతోన్న బోరిస్ జాన్సన్‌కు లేఖ రాసింది. బోరిస్ జాన్సన్ నాయకత్వంలో దేశానికి హోం మంత్రిగా సేవలు అందించే సౌభాగ్యం దక్కినందుకు తనకు సంతోషంగా ఉందని ఆ లేఖలో పేర్కొంది. అంతేకాదు.. 2019లో బోరిస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి గడ్డు పరిస్థితులను, వాటిని పరిష్కరించిన విషయాలను పేర్కొంది. ఆయన హయాంలో తీసుకున్న చారిత్రక నిర్ణయాలు, సంస్కరణలు, అభివృద్ధి కోసం చేసిన కృషి గురించి చర్చించింది. ఆ సుదీర్ఘ లేఖలో, బోరిస్ జాన్సన్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
కాగా.. భారత సంతతి మహిళ అయిన ప్రీతి పటేల్, చిన్న వయసులోనే కన్జర్వేటివ్ పార్టీలో సభ్యురాలు అయ్యింది. 2010లో ఎంపీగా గెలుపొందిన ఆమె.. 2014లో ఆర్ధిక మంత్రిగా పని చేశారు. 2015 ఎన్నికల్లో గెలుపొందాక ఉపాధి శాఖ సహాయ మంత్రిగా చేశారు. థెరిసా మే ప్రభుత్వంలో అంతర్జాతీయ అభివృద్ధి శాఖలో ప్రీతికి రాష్ట్రమంత్రి పదవి దక్కింది. అయితే.. 2017లో ఇజ్రాయెల్ వివాదం కారణంగా ఆమె ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదిలావుండగా.. బ్రిటన్ ప్రధాని పోటీలో లిస్ ట్రస్, రిషి సునాక్ నిలవగా.. దాదాపు 21 వేల ఓట్ల మెజారిటీతో లిస్ ట్రస్ గెలుపొందింది. ఆమె మంగళవారం బ్రిటన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.