కృష్ణాజిల్లా మచిలీపట్నంలో శనివారం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారిని త్వరగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీ కొత్తగా అద్దె బస్సులను అందుబాటులోకి తెచ్చిందని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ తాతినేని పద్మావతి తెలిపారు.
మచిలీపట్నం బస్టాండ్ ప్రాంగణంలో విజయవాడ, ఏలూరు రూట్లలో రెండు నూతన అల్ట్రా పల్లె వెలుగు బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 990 అద్దె బస్సులకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని వీటిలో మొదటి విడతగా 358 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలకు ఇటీవల సమకూరాయాని, కృష్ణాజిల్లాకు 43 బస్సులు మంజూరయ్యాయని తొలి దశలో 15 బస్సులు వివిధ డిపోలకు కేటాయించనున్నట్లు, మొదటిగా మచిలీపట్నం డిపోకు 2 బస్సులు, ఉయ్యూరు డిపోకు 2 బస్సులు అందుబాటులోనికి వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత రెండవ దశలో సూపర్ లగ్జరీలు, ఎక్స్ ప్రెస్ లు, అల్ట్రా డీలక్స్ లు సమకూరనున్నట్లు ఆమె తెలిపారు.
మచిలీపట్నం బస్టాండ్ రూపురేఖలు మారిపోయి. నూతన సొబగులు సౌకర్యాలతో నవీకరించేందుకు 3 కోట్ల రూపాయలను ప్రభుత్వం చేత కేటాయింపచేసిన స్థానిక శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కృషి ఎంతో అభినందనీయమని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ తాతినేని పద్మావతి ప్రశంసించారు. మచిలీపట్నంకు పోర్ట్ రానుండటంతో అభివృద్ధి, రవాణా రంగం ఇక్కడ కొత్త పుంతలు తొక్కనుందని, నెల్లూరు, చెన్నై తరహాలో పోర్టు కారణంగా మచిలీపట్నం కృష్ణాజిల్లాకు మణిహారంగా మారనున్నట్లు జోనల్ ఛైర్మన్ తాతినేని పద్మావతి చెప్పారు.
తొలుత ఆమె మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండు వద్ద నూతనంగా అందుబాటులోకి వచ్చిన 2 అద్దె బస్సులకు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ తాతినేని పద్మావతి మచిలీపట్నం నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, వైఎస్సార్సిపి యువనాయకుడు పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు )లు పచ్చ జెండా లాంఛనంగా ఊపి ఆ బస్సులలో కొద్ది దూరం ప్రయాణించారు. ప్రతిరోజూ మచిలీపట్నం నుంచి ఈ బస్సులలో ఒకటీ ఉదయం 7 గంటల సమయంలో, మచిలీపట్నం నుండి విజయవాడకు వెళ్లే ఆర్డనరీ బస్ కాగా మరొకటి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు మచిలీపట్నం నుండి ఏలూరు పాత బస్ స్టాండ్ కు ప్రయాణించే ఎక్స్ప్రెస్ బస్ అని ఆర్టీసీ డిపిటీఓ గద్దె నాగేశ్వరరావు వివరించారు.
అనంతరం యువ నాయకుడు పేర్ని కిట్టు మాట్లాడుతూ, కొన్ని సినిమాలలో ' మీ బతుకు బందరు బస్టాండ్ ' అని వెటకారం చేస్తుంటే ఈ ప్రాంతవాసులకు మనస్సు ఎంతో బాధపడుతుందని, అయితే, ఆనాటి అసౌకర్యాల దృష్ట్యా ఆలా కించపరిచేవారేమో గానీ, కానీ నేడు ' నవ్విన నాపచేనే విరగపండనుందని ఒక్క ఏడాదిలో బందరు బస్టాండ్ బంగారు బస్టాండ్ అని విమర్శించినవారే పొగడటం ఖాయమని పలువురి హర్షద్వానాల మధ్య పేర్ని కిట్టు పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ ఛైర్మెన్ప, ట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు షేక్ సలార్ దాదా, మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ టి. పెద్దిరాజు, 45 వ డివిజన్ ఇంఛార్జి ఆకుల శ్రీనివాస్ , అర్బన్ బ్యాంక్ చైర్మన్ పల్లపోతు సుబ్రహ్మణ్యం, 15 వ డివిజన్ ఇంఛార్జి ఎం డి రఫీ, 34 వ డివిజన్ ఇంఛార్జి బడే భాను, 32 డివిజన్ ఇంఛార్జి చింతా మౌనిక, మునిసిపల్ కో- ఆప్షన్ సభ్యుడు బేతపూడి రవి, ఆర్టీసీ మెకానికల్ ఫోరమ్ అధికారి అంబటి వేణుగోపాలరావు, ఆర్టీసీ వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు , ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.